పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

280

మహాపురుషుల జీవితములు



దొరగారికి దోఁచని సంగతులు చాలవరకు తెలిసెను. ఆ పత్రికను చదువుకొని మాల్టుబీదొరగారు తానుచేయు మార్పు లెంతవఱకుపయుక్తములో యెంతవఱకు కావో తెలిసికొని మెలకువతో మెలఁగుచు వచ్చెను.

ఆ సంస్థానములో దక్షిణభాగమున గొందఱు క్రైస్తవమతబోధకులుండి వారి పాఠశాలలో మతము బోధించుట యావశ్యకమని చట్టముల నేర్పరచమని తిరువాన్కూరు ప్రభుత్వమువారిని బీడింపఁజొచ్చిరి. పాఠశాలలో మతబోధ విషయమున దొరతనమువారు జోక్యము కలుగఁజేసికొనక పోవుటయే శ్రేయస్కరమని రామవర్మ యొకచిన్న పుస్తకమును వ్రాసెను. అది యిప్పటికిని మనవారందఱు జదువుకొనవలసిన గ్రంథమే. అది వ్రాసిన పిదప గ్రైస్తవ మతబోధకులు తమవాదము గొంతవఱకు విడిచిరి. సంస్కృత విద్యయొక్క యావశ్యకతను గూర్చి రామవర్మ చెన్నపట్టణములోనున్న నార్టను గారికి మంచి యుపన్యాసము వ్రాసి పంపెను. అది చదివి యతఁడు మిక్కిలి సంతసించెను.

1861 వ సంవత్సరమున రామవర్మ చెన్న పట్టణమును జూడఁబోయి యచట గవర్నరుగారి దరిశనము చేసెను. తిరువాన్కూరు రాజకుమారులు చెన్నపురికిఁ బోవుటకు గవర్నరును జూచుటకు నదియే మొదలు ఆయననుజూచి గవర్నరు మిక్కిలి సంతసించి యటువంటి హిందువును తానెన్నఁడు జూచి యుండ లేదని మాల్టుబీదొరగారికి వ్రాసెను. రామవర్మ చెన్నపురిలో నుండినపుడు గవర్నరుతోడను మఱికొందఱు తెల్లవారితోడను కొందఱు స్వదేశస్థులతోడను స్నేహముచేసి స్వదేశమునకుఁ బోయినపిదపఁ గూడ నుత్తర ప్రత్యుత్తరముల మూలమున నామైత్రి నిలుపుకొనెను. గవర్నరు రాజకుమారుని వైదుష్యమునకు మెచ్చి చెన్నపట్టణపు యూనివర్శిటీలో వాని నొక