పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[36]

మహారాజా సర్ రామవర్మ

281



సభ్యునిగ జేర్చెను. ఈగౌరవ మిప్పుడు చవుక యినను వెనుక మిక్కిలి యరుదయి యుండెను. చెన్నపుర సందర్శనమువలన దేశాటనమందుఁ గుతూహలము కలుగ రాజకుమారుఁడు స్వదేశముఁ జూడవలయునని సంకల్పించెను. సంకల్పించి బయలుదేరి యతఁడు పూనికతో నన్నికొండలను నన్నినదులను నన్ని జలసత్రములను జూచెను. చిత్రమనస్కులైన పురుషులు తిరువాన్కూరులో నెక్కడికైనఁబోయి యొక పాడుదేవాలయమును ప్రాతకోటను యొకపురాతన శాసనమును మఱియే పూర్వకాల చిహ్నమునో జూచి తాము దానిని క్రొత్తగా గనిపెట్టినామని చెప్పుకొన్నప్పుడు తత్ప్రదేశముల నున్నవారు వారిపలుకులు విని నవ్వి "అది యీవఱకు మావైశాఖం తిరువల్ కనిపెట్టినదే క్రొత్తదికా" దని తెలియజేయుచుందురు. వైశాఖం తిరునల్ల ను నది రామవర్మయొక్క రెండవపేరు. ఈ దేశయాత్రలో నతఁడు చిత్రచిత్రములగు మొక్కలను, విత్తనములను, రాళ్ళను, లోహములను, వన్నె పురుగులను, వింతపిట్టలను, చిన్న చిన్న క్రిమిజాతులను బ్రోగుచేసికొని బండ్ల మీఁదవేయించి స్వగృహమునకు దెప్పించుచుండును. మఱియు నతఁ డంతతోఁదృప్తినొందక స్వదేశమునఁ బెరిగెడు యోషధుల యొక్కయు బుష్పముల యొక్కయు లతలయొక్కయుఁ జిత్రవస్తువులయొక్కయుఁ జిత్తరువులు తనకొలువులో నున్న చిత్రకారులచేత వ్రాయించి దగ్గరనుంచుకొనును. ఇట్లు ప్రోగుచేసిన వస్తుసముదాయములనుండి కొన్ని వస్తువులు తీసి యతఁడు విదేశస్థుల కిచ్చి వారివద్దనుండు విచిత్రవస్తువులను తనవానికి బదులు గ్రహించుచుండును.

ఆతఁడు ప్రకృతిశాస్త్రములను జదువుటయేగాక వానియం దనుభవము కలుఁగునట్లు పరిశ్రమచేసెను. ఆయనకు వృక్షశాస్త్రము నందు మిక్కిలి యభిమానముకలదు. దానికిఁదోడుగ వ్యవసాయము