పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సి. వి. రంగనాథశాస్త్రి

269



వచ్చెను. ఈపని ఖాయమైనప్పుడు రంగనాథశాస్త్రి హైకోర్టులోఁ దనకున్న తర్జుమాదారుపనిని మానుకొనగా హైకోర్టులో మొదట జడ్జీయగు సర్ స్కాట్లండు దొరగారును మరొయొక జడ్జీగారును గలసి వానికి గొప్ప యుద్యోగమైనందుకు సంతసించు చుంటిమనియుఁ దమ వద్దనుండి యతఁడు వెళ్ళవలసివచ్చినందుకు విచారించితిమనియు నొక జాబు వ్రాసి పంపిరి. రంగనాథశాస్త్రి సమర్థుఁడు చాకచక్యము గలవాఁడు నగుటచేఁ దన చేయవలసిన పని నతి శీఘ్రముగ జేసికొని తక్కిన కాలము గ్రంథావలోకనమునందు గడపసాగెను. అందఱియెడ గౌరవము గలిగి యందఱకు సులభుఁడై యుండినందున జను లిప్పటికి రంగనాథశాస్త్రివంటి జడ్జీలు స్మాలుకాజుకోర్టులకు రా లేదని చెప్పుకొనుచుందురు. ఈయుద్యోగమైన తరువాత నతఁ డరబ్బీభాష గృషిచేసి యల్పకాలములోనే మంచిపాండిత్యము సంపాదించెను. పారసీభాషలో మంచి కవీశ్వరులగు సాదీ మొదలగువారి పుస్తకముల నుండి యెన్నో పద్యము లతఁడు కంఠపాఠముగ వల్లించెను. అతఁ డేభాషలోఁ గృషి చేసినను దేనినిఁ బూనినను రక్కసిపట్టుపట్టి దానిని తుద ముట్టించును. జనులతనిని పురుషసింహమని వేనోళ్ళం బొగడుచు వచ్చిరి. అతని సర్వతోముఖపాండిత్య మాకాలమున నెల్లవారికిఁ బ్రశంశనీయ మయ్యెను. గవర్నరు లందరు వాని సమాన గౌరవముతో నాదరించుచు వచ్చిరి. చెన్నపురి గవర్నరులలో సంస్తవనీయుఁడు ధాత సంవత్సర కాటకములో నన్నములేక చచ్చిపోవు బీదలకుఁ బని గల్పింపఁదలచి బెజవాడనుండీ చెన్నపట్టణము వఱకు నొక గొప్ప కాలువ త్రవ్వించిన దయాళువునగు బక్కింగుహాం ప్రభువుగారు రంగనాథశాస్త్రి వైదుష్యమును మెచ్చి జర్మినీభాష గూడ జదువుమని ప్రేరణ చేసిరి.