పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

168

మహాపురుషుల జీవితములు

అని యాగవర్నరుగారు కొండొకసేపామెను మఱికొండొకసేపామెభర్తను వారుచేసిన పాత్రదానములనిమిత్తమయి కొనియాడి మొత్తముమీద జీజీభాయి కుటుంబమువారు ధర్మ కార్యముల నిమిత్తము లక్షపౌను లనఁగా నిప్పటిధర ప్రకారము పదునైదులక్షల రూపాయిలు దానమిచ్చెనని సఘ్యలకుఁ దెలిపెను.

1858 వ సంవత్సరమున విక్టోరియాదేవిగారు మనదేశమును కంపెనీ యధీనమునుండి తనయేలుబడి క్రిందికిఁ దీసికొనినప్పుడు జీజీభాయిగారికి 'బేరొనెట్‌' అను బిరుదము నిచ్చిరి. ఈగౌరవ మంతకు ముందేగాక యిటీవల సయితము మనదేశస్థులలో నెవరికిం గలుగ లేదు. దయాసాగరుఁడగు నీ మహాదాత 1859 వ సంవత్సరమున ననఁగా డెబ్బదియాఱేండ్లప్రాయమునఁ గాలధర్మము నొందెను.

ఆయన చనిపోయినాఁ డనుమాటయేకాని చేసినసత్కార్యములవలన నిప్పటికి జీవించియున్నాఁడని మనము గ్రహింపవలయును. ఈ జీజీభాయిగారి చరిత్రమువలన మనము నేర్చికొనవలసిన నీతులు కొన్ని యున్నవి. అందు మొదటిది స్వతంత్రవృత్తిసంపాదించుకొనుట మన దేశములోఁ జదువుకొన్నవా రందఱు దొరతనమువారి నాశ్రయించి యేదో యుద్యోగము సంపాదించి జీవితమంతయునందులోనే గడుపుచు ననేక బాధలుపడుచున్నారుఁ అట్లుచేయుటతప్పు. స్వతంత్ర వృత్తిని సంపాదించుకొనవలయునేకాని యెల్ల కాలము దొరతనము వారినే నమ్ముకొనియుండఁగూడదు. జ్ఞానమునిమిత్తము చదువుకొనవలయునుగాని యుద్యోగమునిమిత్తము చదువుకొనఁగూడదు. తగిన జ్ఞానము సంపాదించుకొని స్వతంత్రవృత్తి నవలంబించుట పురుష లక్షణము. జీజీభాయి యీసిద్ధాంతము నమ్మినవాఁ డగుటచే స్వతంత్రవృత్తి నవలంబించి యెన్ని యిడుమలకైన నోర్చి యంతటి గొప్ప వాఁడయ్యె.