పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

146

మహాపురుషుల జీవితములు

నందుఁ బ్రతిమాసమున దేశమంతటనుండి తీర్థవాసు లీ పట్టణముఁ జేరుచునే యుందురు. ప్రత్యేకముగ నచ్చట దీర్థము వచ్చినప్పుడు చేరు జనులసంఖ్య మితిమీఱియుండును. అట్లు వేనవేలు జనులు చేరిన సమయమునఁ దనమతము బోధింపవలయునని దయానందుఁడు సంకల్పించి తీర్థము జరుగుట కొక నెలముందు హరిద్వారముఁ జేరెను. చేరి రాత్రి యనక పగలనక యా నెలదినములును దరువాత తీర్థదినములబోను దయానందుఁ డెత్తగు నొకకొండపైనిలచి వాక్ప్రవాహమును దొర్లున ట్లుపన్యసించి విగ్రహారాధనముఁ జేయగూడదనియు నదీజలములలో మునిగినంతమాత్రమున మోక్షము లేదనియు బోధించెను. ఆజానుబాహుఁ డగు నతని మూర్తియు గంభీరమగు వాని కంఠధనియుఁ జూచి వినిన వారికి వానియందు పరమభక్తికుదిరెను, విగ్రహారాధనము ఖండించుటచే నతనిసాహసమున కంద ఱచ్చెరువడిరి. అతని మాటల నొక్కసారి వినినవారు తరుచుగ వాని పక్షమే దిరుగుచువచ్చిరి. అతని బోధలవలన విగ్రహారాధనము మంచిదని బోదించు బ్రాహ్మణులకుఁ గొంతనష్టము గలిగినందున వారతనిని నిందించిరి. ఆనిందలకు లెక్క సేయక జనులతో వాదనలు సేయునపుడు తన కెక్కువ చిత్తశాంతియు నెక్కువ నోపికయు నుండవలయునని యాగుణముల నలవరచు కొనుటకు రెండేండ్లడవి కేగి తపస్సు చేసెను. ఆతపస్సు ముగిసినపిదప దయానందుఁడు మరల తనపని నారంభించి గంగాతీరమున నున్న కాన్పూరు నగరమునకు వచ్చెను. ఆ నగరమున హలధరోజుఁ డను మహాపండితుఁ డొకఁ డుండెను.

విగ్రహారాధనము దుష్కార్యమని దయానందుఁడు బోధింపఁ గానే యాయూరిపండితు లది సహింపలేక హలధరునితో వాదింపుమని వాని నడిగిరి. అతఁ డందుకు సమ్మతించి సభ గావింపు మని