పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/178

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
147
స్వామి దయానంద సరస్వతియెను. అప్పుడు జరిగిన సభకు వేన వేలు జనులువచ్చిరి. కానుపూరు నగరమం దశిష్టాంటుకలక్టరును సంస్కృత భాషాపరిచితుఁడు నగు 'తేరా' యను దొరగారుభయుల వాదములువిని తీర్పు చెప్పుటకు మధ్యవర్తిగ నేర్పడియెను. అప్పు డతివిచిత్రముగ హలధర దయానందులకు వాదోపవాదములు జరిగెను. విగ్రహారాధనము మంచిదని హలధరుఁ డెన్నిప్రమాణములు చూపినను దయానందుఁడు వాని నన్నిఁటి నవలీలగా ఖండించెను. దయానందుని ప్రమాణములుప్రబలముగ నుండుటయు హలధరుని ప్రమాణములు దుర్బలములుగ నుండుటయు గ్రహించి 'తేరా' దొరగారు తానక్కడ నటమీఁద నుండ నక్కఱలేదని దయానందునివద్ద శలవుపుచ్చుకొని వెళ్ళెను. అతఁడు పోయినతోడనే హలధరునిపక్షమున వచ్చిన పండితులు తాము గెలిచితిమని కేకలువేయుచు లేచి హలధరునొక బండిమీఁద గూర్చుండఁ బెట్టి యూరేగించుచు దీసికొనిపోయిరి. ఆసాహసమున కచ్చెరువడి యెవరు గెలిచిరో సత్యమును దెలుపుమని దయానందుని పక్షమువారు దొరగారికి వ్రాసిరి. ఆదొరగారును జరిగినపనికి విస్మితుఁడై దయానందుఁడే గెలిచెననియు హలధరుఁ డోడిపోయెననియుఁ దానాసంగతి వ్రాఁతమూలముగ దయానందునకుఁ దెలియఁ జేయఁ దలంచుచుండె ననియు వ్రాసి ప్రత్యుత్తరమంపెను. అనంతరము (అనఁగా 1869 వ సంవత్సరమున) దయానందుఁడు హిందువులకు భూలోకకైలాసము విద్యలకు నిధానము, పుణ్యభూములలో నగ్రగణ్యము నగు కాశీనగరమునకుఁ బోయెను.

వందలకొలది దేవాలయములు వందలకొలది విగ్రహములు నున్న యన్నగరమున నీస్వామి విగ్రహారాధనము వేద వేదవిరుద్ధమని బోధింప నారంభించినతోడనే బ్రాహ్మణులు రోషావేశ పరవశులై రాజుతోఁ జెప్పిరి. అప్పుడు కాశీరాజగు శివప్రసాదుగారు వారణాశీ