పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్వామి దయానంద సరస్వతి

139

శివరాత్రినాడు దానికి ముహూర్త మేర్పరచెను, అప్పటికి దయానందునకు శరీరమునందు స్వస్థత లేనందున దినమంతయు నతఁ డుపవాసముండలేడనియు రాత్రి జాగరము చేయ లేడనియు లింగధారణము మఱియొకప్పుడు చేయవచ్చుననియు జెప్పి యప్పు డాపని మానుమని తల్లి యనేకవిధముల దండ్రినిఁ బ్రతిమాలుకొనియెను. కాని యతఁ డామాట పెడ చెవినిఁబెట్టి యది యప్పుడే జరిగితీరవలయునని పట్టు పట్టెను. అందుచే దయానందుడు శివరాత్రినా డుదయమున స్నానముచేసి మడిఁగట్టుకొని తండ్రింగూడి శివాలయమునకుఁ బోయి దినమెల్ల నుపవసించి యుండెను.

ఆలయమంతటను జనులు ఓంహర, ఓంహర, మహాదేవ, యని కేకలు వేయుటచే గుడి ప్రతిధ్వనులిచ్చెను. రాత్రి భక్తులందఱు జాగరము చేయదలంచి కష్టపడి రెండుజాములవఱకు మేలుకొని నిద్ర నాపుకొనలేక యెక్కడివా రక్కడనే కటికినేలం బండుకొని నిద్రించిరి. జాగరముచేయ లేకపోయినచో ఫలము చెడునేమో యని భయపడి బాలుడు దయానందుఁడు మాత్రము కన్ను మూయక శివవిగ్రహమువంక జూచుచు గూర్చుండెను. అట్లుండ నావిగ్రహము మీద నొక చిట్టెలుక ప్రాకి దేవునకు నై వేద్యము నిమిత్తము పెట్టిన వస్తువులఁ గొన్నిటి నెత్తుకొని పోయెను. అది చూచినతోడనే దయానందుని మనస్సు పరిపరివిధములఁబోవ తనలో దానిట్లని వితర్కించుకొనియె.

"ఈరాతిబొమ్మనంది పై నెక్కి త్రిశూలము చేతఁబట్టుకొని సృష్టిస్థితిలయములు చేయగల మహాదేవుడేనా! అట్లయినం దనమీద నెలుకబ్రాకి తననిమిత్త ముంచినపండ్ల నెత్తుకొనిపోవుచుండ దాని నదలింపఁ జాలఁడేమి? ఈ నల్లఱాయి దేవుఁడుగాడు." అని కొండొకసేపు తలపోసి నిదురించుచున్న తండ్రినిలేపి సంశయము