పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

142

మహాపురుషుల జీవితములు

యెందునుం బాలునింగానక విసికి వేసారి యింటికివచ్చిరి. తలిదండ్రులు బిడ్డనియెడ నాసవిడిచి దుఃఖితులై యూరకొనిరి. దయానందుడు వివాహబాధ తప్పినందుకు సంతసించుచు బయనమైపోయి త్రోవలోఁ దన శరీరముమీఁదనున్న మురుగులు మొదలగు నగలనుదీసి బ్రాహ్మణులకు దానమిచ్చి యొకబ్రాహ్మణు నాశ్రయించి కావిగుడ్డలు సంపాదించి బ్రహ్మచర్యాశ్రమమునం బ్రవేశించెను. జ్ఞానవంతులగు సన్యాసులు సాధువులు బైరాగులు ఎక్కడనున్నారని తెలిసిన నది యెంత దూరమైనసరే యచటకుఁబోయి వారిని సేవించి యతఁడు జ్ఞానము సంపాదించుచుండును. సిద్ధిపురమను నొక పుణ్యక్షేత్రమున జరుగఁబోవు తిరునాళ్ళకుఁ బోవఁదలఁచి కొందఱు సన్యాసులంగలసి యతఁ డుండ వానిని వానితండ్రిని నెఱిఁగిన యొక మనుష్యుఁడు వాని నాన వాలుపట్టి పోవు చోటు తెలిసికొని రహస్యముగఁ దండ్రికి జాబు వ్రాసెను.

ఆ వార్త విని తండ్రి మహానందభరితుఁడై మెఱియలవంటి బంట్లను పదుగురఁదోడ్కొని సిద్ధిపురమునకు వచ్చి రెన్నాళ్ళు రేయింబవళ్ళు వెదకి యెట్ట కేలకు మదిమంది సన్యాసులనడుమఁ గూర్చుండఁగ గుమారు నానవాలుపట్టి యక్కడనే వాని కాషాయ వస్త్రములం జింపివేసి యనుచితమగు నాపని చేసినందుకు దూషించి జాగ్రత్తగాఁ గాపాడుమని వానిని సేవకులకప్పగించెను. ముష్కరులగు నాబంటులు వాని నిట్టట్టు గదలనీక గడు జాగరూకతతో నాదినమంతయుఁ గాచిరి. నిద్ర యెట్టిపనినై నను మరపించునుగదా, ఆ బంట్లు రాత్రి యంతయు మేలుకొని తెల్లవారగట్ల కనుమూసి నిద్రించిరి. తాను మరల దండ్రిచేతఁ బడినందుకు విచారించుచు దయానందుఁడు కన్ను మూయనందున బంట్లు నిదురింపఁగానే యదేసమయమని లేచి మెల్ల మెల్లగ నావలకుఁ బోయి గబగబ పరుగెత్తి కొంతదూరముపోయి