పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


చేసెను. చాలరోజులు రోముపట్టణములో నివసించుట చేత రాజ్యతంత్రములలోని దోషముల నతఁడు బాగుగ గుఱ్తెఱిఁగి వానిని శుభ్రపఱచుట కుద్యుక్తుఁడయ్యెను. అతిసూక్ష్మబుద్ధిఁ గలవాఁడై, యే యంశమునైన సులభముగ గ్రహించి యుచితముగ విచారించును. నిరంకుశ ప్రభుత్వముకలవాఁడగుట చేత నతఁడు లోపములను సవరించి న్యాయచట్టములను సుళువుగ మార్చుటకు సమర్థుఁడయ్యెను.

యుద్ధములు విశేషముగ జరిగినందునను, శూరులకుబహుమానము లిచ్చుటచేతను, వృత్తి భోగులకు వార్షికము లిచ్చుట వలనను, బొక్కసములోని ధనము తగ్గెను. రు. 3,20,000 లు పరదేశీయులు వృత్తిభోగులుగ వార్షికములను పుచ్చు. కొనుచున్నందున, వారి పట్టీని పరీక్షించి యుద్ధములలో మరణమునొందినవారిని మినహాయించి వారి సంఖ్య నతఁడు తగ్గించెను. తిరుగుబాటుచేయక లోఁబడిన వారినందఱి నతఁడు రక్షించెను. మొండితేరి మౌర్ఖ్యముగ మెడ్డొడ్డినవారి సతఁడు దండించెను. పట్టణమునకుఁ గావలసిన నీటిసదుపాయము నతఁడు చేయించెను, రాజమార్గములను వేయించి, కాలువలు త్రవ్వించి రోము మహారాజ్యము నాపనము (Survey) చేయించి, దాని పరిమితఁ దెలిసికొనుట కతఁ డొక పటమును వ్రాయిం పించెను. ప్రాచీ నాధునిక న్యాయచట్టముల నతఁడు సమన్వయింపఁ జేసి చేర్చెను. ప్రజారాజ్యము నేక రాజ్యాధిపత్యముగ