పుట:KutunbaniyantranaPaddathulu.djvu/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5. లూప్

గర్భాశయంలోకి సంతాననిరోధక సాధనాన్ని ప్రవేశాపెట్టి గర్భం రాకుండా చేసే పద్దతి దాదాపు 2000 సంవత్సరాల నుంచి అమలులో ఉంది. ప్రాచీన గ్రీకు వైద్య పితామహుడు హిప్పోక్రాట్ తన వైద్య పద్ధతిలో లూప్ వంటి సాధనం గురించి వివరించారు కూడా. శతాబ్ధాల పాటు అరబిక్, తుర్కిష్ వ్యాపారులు తమ ఒంటెల విషయంలో లూప్ వంటి గర్భనిరోధక పద్ధతి అవలంభించారు. ఒంటెల మీద సామాను వేసుకొని నలల తరబడి ఎడారుల గుండా పోయేటప్పుడు ఒంటెలు గర్భం ధరించకుండా గర్భాశయం లోకి గులకరాళ్ళు ప్రఫేశపెట్టేవాళ్ళు. ఈ విధంగా లూప్ వంటి ఉద్దేశ్యం మానవునికి ఏనాటినుంచో ఉంది.

ఈ శతాబ్దం ప్రారంభంలో 1929 లో జర్మన్ దేశంలో గ్రీఫెన్ బెర్గ్ అనే శాస్త్రజ్ఞుడు సంతాన నిరోధక సాధనంగా లూప్ వంటి సాధనాన్నిరూపొందించాడు దానినే గ్రీఫెన్ బెర్గ్ సిల్వర్ రింగ్ అనేవారు. 1959 సంవత్సరం వరకు గ్రీఫెన్ బెర్గ్ రూపొందించిన లూప్ వంటి ఈ సాధనం అనేక రూపాంతరాలు చెందుతూ ప్రచారంలో ఉంది. 1962 నుంచి లూప్ మరింత క్రొత్తగా రూపం దిద్దుకొని విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.