పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సబినస్పెక్టరు కొంత గడబిడ చేయసాగించెను. కొందరు మిత్రులు శాంతవచనములుచెప్పిభద్రముచేసిరి. సభకుచెన్నపట్టణమునుంచి హైకోర్టువకీలు శ్రీపురాణమునాగభూషణముగారుకూడవిచ్చేసిరి. గుంటూరునుండి న్యాపతి హనుమంతరావుగారును హైస్కూలులో ఉపాధ్యాయులుగా నున్న జగన్నాధరావుగారును గూడ హాజరైరి. అప్పటికింకను గ్రాంటుబడులలో ఉపాధ్యాయులు రాజకీయములలో పాల్గొనగూడదను నిషేధము పుట్టలేదు. సభలో విదేశవస్తుబహిష్కారమును స్వదేశవస్తుప్రోత్సాహమును చేయవలయునని తీవ్రచర్చ జరిగినది. కొంత కలకలము బుట్టెను. తీరుమానమునకు అనుకూలురను ప్రతికూలురను లెక్కపెట్టవలసివచ్చెను. పంక్తులవరుసను తిరిగి నేనే స్వయముగ లెక్కపెట్టగా అనుకూలురసంఖ్య మిక్కిలి హెచ్చుగ తేలినందున కరతాళధ్వానములు మిన్నుముట్టెను. సభ మరికొన్ని తీర్మానములుచేయుటతో ముగుసెను. పోలీసువారితో తొందరలేకుండ జరిగిపోయినందున కందరును సంతసించిరి.

కాంగ్రెసు సభాకార్యములు కృష్ణా గుంటూరు జిల్లాలు చేరిన విశాలదేశఖండమున సంతుష్ఠిగ జరుపుటకు అవకాశము లేకుండెను. ప్రతిసంవత్సరము వార్షికమహాసభ ఒక్క జిల్లాలో జరుగుట కవకాశములేక రెండేండ్లకొకసారి జరుపవలసివచ్చెను. ఇందువలన ప్రజలలో కాంగ్రెసువ్యవహారములనుగూర్చిన ఉత్సాహము శ్రద్ధావిశేషములు తగ్గిపోవుచుండెను. స్థానికములైన ఇబ్బందులనుగూర్చిన విచారణకు అవకాశము కొఱతబడసాగెను. కావున గుంటూరు ప్రత్యేకజిల్లాగా విభజనకాబడినది. కాబట్టి