పుట:Kavijeevithamulu.pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామరాజభూషణకవి.

351

యట్లు చేయుచున్నాను. అది కొంచెము గ్రంథవిస్తరము గలదిగా నున్నను ఇపుడు మనము చరిత్ర వ్రాయుచున్న రామరాజభూషణుఁడు నరసభూపాలీయకృతిపతి యగుభట్టుమూర్తి స్పష్టముగా కాఁ డని నిశ్చయించి చెప్పుటకు చాలియుండఁగా, అట్టిసిద్ధాంతము ప్రత్యేక మాయిర్వురివలనను జేయంబడిన వసుచరిత్ర హరిశ్చంద్రనలోపాఖ్యాన నరసభూపాలీయములనుండియే చూపింపఁబడినది గావున నది సర్వజనాదరణీయము కాకపోదు కావున నాయుపన్యాససంగ్రహము నిట వివరించెదను.

భట్టుమూర్తి రామరాజభూషణుఁడా ?

ఆ 1896 సంవత్సరములోని పట్టపరీక్ష (B. A. Degree Examination) కుఁ బఠనీయాంధ్రగ్రంథములలో నొక్కటియగు హరిశ్చంద్రనలోపాఖ్యానగ్రంథమును ముద్రించి ప్రకటించుచున్న బ్ర. మ. పూండ్ల రామకృష్ణయ్యపంతులవారివలన నెల్లూరినుండి పంపఁబడిన (68) పుటలగ్రంథసంచిక యొకటి యీనడుమ మాకార్యస్థానముం జేరినది ఆగ్రంథములోనివిశేషముల నారయుటకై కోరి మొదటిపుట తిరుగ వేసి చూచినతోడనే యముద్రితగ్రంథచింతామణిపత్త్రి కాధిపతి యగు పైరామకృష్ణయ్యపంతులవారిచే రచియింపఁబడినపీఠిక యనుశీర్షిక యొకటి కాన నాయెను. అందలియంశములు చూడంజూడ ప్రథమమున దాని పైని మాయభిప్రాయ మీయనిదే గ్రంథవిషయ మైనయభిప్రాయమీయ వీలు లేనందున నిపు డాపీఠికపై యభిప్రాయమునే వ్రాయుదము.

ఆపీఠికలో 7 పేరాలవఱకును కవి యగురామరాజభూషణుని చారిత్రవిషయమై బ్ర. కందుకూరివీరేశలింగము పంతులవారికిని రామకృష్ణయ్య పంతులవారికిని నడిచిన సంవాదమై యున్నది. అట్టియుభయులసంవాదమును ప్రస్తుతము మేము విమర్శన చేసి మాఅభిప్రాయముతోఁ బ్రకటించెదము.