పుట:Kavijeevithamulu.pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

352

కవి జీవితములు

రా. కృ. పీఠికలో హరిశ్చంద్రనలోపాఖ్యానమును వసుచరిత్రాది కావ్యములను రచియించినసూరపాత్మజుఁ డగుప్రబంధాంకము రామరాజభూషణకవి విరచించెను, ఇక్కవి నిజమైననామముబట్టి మూర్తి యనియును, రామరాజభూషణుఁ డనునది రామరాజుయొక్క యాస్థానమం దుండుటచేత వచ్చినబిరుదునామముగా గొందఱనుచున్నారని క. వీ. ఆంధ్రకవులచరిత్రమునఁ బ్రకటించి తా మట్టివారి యభిప్రాయములను ఖండించి వ్రాయనందున నందుల కొప్పుకొనినవారుగఁ గనుపించుచున్నా రని వ్రాసియుండిరి. అయితే ఇట్టిచోటుల ఆంధ్రకవుల చరిత్రములో నెట్లు వ్రాయ బడినదో దాని నుదాహరింపనిదే మాయభిప్రాయ మీయ వలనుపడదు. గావున దాని నీక్రింద వివరించెదము.

ఆంధ్రకవులచరిత్రము 66 వ పుటలో

"మూర్తి యనియు రామరాజభూషణుఁ డనియును ఇద్దఱు వేఱువేఱుకవు లనియును, అందు మూర్తికవి నరసభూపాలీయమును, రామరజభూషణకవి వసుచరిత్ర హరిశ్చంద్రనలోపాఖ్యానములను రచియించి రని కొందఱును, ఇద్దఱు నొక్కరే యనియును, మూర్తి యనునది నిజమైనపేరు అనియు రామరాజభూషణుఁ డన్నది రామరాజుయొక్కసభ కలంకారముగా నుండుటచేత వచ్చినబిరుదుపే రనియును నతఁడు సూరపరాజున కౌరసపుత్త్రుఁడై తదగ్రజుఁ డైనవేంకటరాయభూషణునకు స్వీకృతపుత్త్రుఁ డని మఱికొందఱును చెప్పుచున్నా రనియును, వసుచరిత్రములోనిగద్యమొకవిధముగాను నరసభూపాలీయములోని గద్య మింకొకవిధముగా నుండుటంబట్టియు, హరిశ్చంద్రనలోపాఖ్యానములో సూరపాత్మజుఁడు రామభూషణుఁడనియు, నరసభూపాలీయములో వేంకటరామభూషణ సుపుత్త్రుఁ డగుమూర్తియనియు తండ్రులను వేఱువేఱుగాఁ జెప్పుటనుబట్టియు వారు వేఱుకవు లైనట్లు పైకి కానవచ్చు చున్నను కొన్ని హేతువులం బట్టి రెండవపక్షమువారు చెప్పెడియంశములు కూడ సావధానముగా విచారించ వలసినవి గానున్నవి"