పుట:Kasiyatracharitr020670mbp.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తీసుకుంటే పుల్లగా వుంచున్నది గనుకనున్ను అగ్ని గంధకపు భూమిలో తనంతట పాషాణ సంబంధమయితే త్వరగా వుత్పత్తి కావచ్చును గనుక నున్ను లోకారాధ్యుడు మహానదులనున్ను, మహాపర్వతాలనున్ను అనేకముగా సృష్టించి నప్పటికిన్ని అటువంటి సృష్టికోటి చూచి ఒక వేళ తన అత్యద్భుత చర్యను తెలుసుకొలేక పోదురనే తాత్పర్యముతో యీ వుష్ణ గుండాన్ని తగుపాటి కారణాలను వుంచి సృష్టించినాడని తోచబడుచున్నది.

యీ వుష్ణగుండపు కధ: శ్రీరాములు రావణ బ్రహ్మహత్య పరిహారార్ధముగా ముద్గలాశ్రమమునకు సహకుటుంబముగా వచ్చి నట్టున్ను, అప్పట్లో తన లంకా నివాసదోష సందేహము అక్కడవున్న అనేక ఋషులకున్ను, అక్కడికి సమీపమందున్న తన తండ్రి అయిన మిధిలాపురనాయకుని కిన్ని నివృత్తి అయ్యేటట్టు పాతాళమందు వుండే బాడబాగ్నిని తెప్పించి సీతాదేవి తాను ప్రవేశమై బయిటికి వచ్చి నట్లున్ను, ఆ అగ్నివల్ల యీలోకానకు బాధలేకుండాపిమ్మట అక్కడ తదుపరి వుదకప్రవాహాన్ని సృస్టించినట్టున్ను తద్వారా అద్యా ఆ వుపి ఉదకము వుష్ణకరముగా వుండేటట్టున్ను చెప్పుతారు.

రామకృష్ణాద్యవతారములు అబద్ధములు కావు గనుకనున్ను, వారు పరబ్రహ్మ స్వరూపు లనడానకు యేమాత్రము సందేహము లేదు. గనుక నున్ను తమమహిమలు లొకములో ప్రసిద్దిగా వుండేకొరకు యిటువంటి యాశ్చర్యకరము లయిన విషయాదులు కలగచేసినా కలగజేసి వుండవచ్చును.

యీ స్థలమందు వసించి ఆమరునాడు జాంగీరు అనిన్ని, జాంగరాబాదు అనిన్ని చెప్పబడే గొప్పబస్తీ యయిన గంగ వుత్తరవాహినిగా ప్రవహింఛే పుణ్యస్థలము ప్రవేశించినాను. యీ వూరు కలకటరు మొదలయిన అధికారస్థులు వసించే జిల్లా కాకపోయినా నీలిమందు చేసే యింగిలెషు దొరలు గంగాతీరమందు అక్కడక్కడా మిద్దెలు వగయిరాలు కట్టుకొని యీ ప్రాంతముల అనేకులు వుండేటట్టు యిక్కడా కొందరు వసించి యున్నారు. యిది గొప్పవూరు. మైధిలి కాన్యకుబ్జ బ్రాహ్మణులు యిండ్లుకట్తుకొని తీరవాసు లయి యున్నారు.