పుట:Kasiyatracharitr020670mbp.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

న్నవి. సుగంధము కల పూలలో పన్నీరు పూలు ఒక దినుసు, జాజిపూలు ఒక దినుసు, సబురాపూలు అని ఒకదినుసును; యివి తప్ప కడమ దొరికే పూలు అన్ని చూపులకు అలంకారముగాని సుగంధము కలవి గావు.

యీ గయా మహాక్షేత్రములో చెప్పే సంకల్ప క్రమము యీ అడుగున వ్రాయుచున్నాను. నెం.28. 'వైవస్వత మంవంతరే, మేరో, దక్షిణ దిగ్భాగే, ఆర్యావర్తాంతర్గత మధదేశే గయా గదాధర క్షేత్రే, కోలాహలపర్వతే, మధువనే, విక్రమశకే, బౌద్ధావతారే, బార్హల్స్పత్యమానే, ప్లవనామసంవత్సరే, ఆత్మహితైకోత్తరశతకులొద్ధారణార్ధ 'మని చెప్పుచున్నారు.

ఈ మగధదేశములో వుండే మహాస్థలములు:--నెం.29. గయ 1, రాజగృహి 2, పవనాశ్రమం 3, పున: పున: 4, లోహదండం 5, వైకుంఠం 6, ఈ మహాస్థలములకు యాత్రార్ధము వస్తే రావచ్చును గాని నిర్మిత్తముగా యీ దేశానకు కర్మకులు రాకూడ దని పూర్వీకులు పురాణసిద్ధముగా నియమించి వున్నారు.

కాశీ నుంచి గయకు రావలసిన దారిని నేను రాకపోయినా విచారించి ఆ దారి మజిలీ వూళ్ళు క్రమముగా వ్రాయుచున్నాను: నెం.30. మొగలుసరాయి కోసులు 5, కఫనాశిని కో(సులు) 7, మోఘనాసరాయి కో.7, సహస్రాం కో. 12, నాసరుగంజు కో.10, పున:పున: కో 7, పదాన్ పూరు కో 9, గయ కో 5, అంతుకోసుల 62.

యీ గయా షహరులో నల్లరాతితో చెంబులు; గ్లాసులు, తట్టలు, ప్రతిమలు మొదలయిన స్వరూపాలు బహుకుదురుగా చేసి అమ్ముతూవుంటారు. అనేక విధములయిన విగ్రహాలు విత్తళి(ఇత్తడి)తో పోసి అమ్ముతునారు. విష్ణు పాదాలు తామ్రరేకులతోను, వెండితోను అనేక దినుసులుగా చేసి అమ్ముతూ వున్నారు. యిక్కడికి సమీప మయిన రాజగృహి కొండలవద్ద నున్ను, టంకారి అనే వూరి కొండవద్ద నున్ను స్ఫటిక శిలలు పుట్టు చున్నవి గనుక వాటిని స్ఫటిక మణులుగా నున్ను, శివలింగాలుగా నున్ను చేశి యీ గయా క్షేత్రములో అమ్ముతూ వుంటారు.