పుట:Kasiyatracharitr020670mbp.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పడవలు యెల్లప్పుడు వస్తూపోతూ వుండడముచేత యీ పడవలు వాడికెగా నిలిచే ఘాట్లవద్ద యిటువంటి భక్ష్యయోగ్య మయిన వస్తువులు తెచ్చి పెట్టుకుని అమ్ముతూ వుంచున్నారు. కాశిలో అమ్మే గొయ్యా పండ్లు (జామపండ్లు) మిక్కిలి గొప్పలుగా, విత్తులు శానా తక్కువగా యుంచున్నవి. ఈ దేశములో కాలము యెరిగి కూరకాయలు వేయుచున్నారు గనుక ఒక కాలములో అయ్యేవస్తువులు మరియొక కాలములో మన దేశములో అకాలములో కూడా దొరికేటట్టు చిక్కదు.

పట్నా అనే షహరు దానాపూరు మొదలుగా ఆరుకోసుల దూరమునకు ఒకే షహరుగా నున్నది. పట్నా షహరులో కలకటరు జడిజీ మెజిస్ట్రేటు ఉండడము మాత్రమేగాక ఒక అప్పీలు కోరటు రివిన్యూ క్రిమినాలు సంగతులు విచారించడానకు ఒక కమిసనరు వున్నాడు. యీ షహరు మ్లేచ్ఛమయముగా నున్నది. లోగడ యెల్లీసు దొర యీ దేశము చూసే నిమిత్తము వచ్చియుండి యీ షహరులో గోమాంసము బహిరంగముగా బజారులో పెట్టి అమ్ముచున్నారు, యీ వింత నేను హిందూదేశములో యెక్కడ చూడలే దని వ్రాసినాడు. అటువంటి వస్తు విక్రయము నా కండ్ల పడకపోయినా అంతపని సాధారణముగా చేసేపాటి మ్లేచ్ఛ షహరు అనవచ్చును.

ఈ షహరులో రెండు దేవస్థలా లున్నవి. ఒకటి పట్నాదేవి మందిరము, మరియొకటి గోపీనాథుని మందిరము. రాజసపూజ వితరణగా జరుగుచున్నది. గాజీపూరు, ఆరా, చప్రా, వీటికన్నా యీ షహరులో యిండ్లమిద్దెలున్ను విస్తారముగా నున్ను, గొప్పలుగానున్ను కట్టియున్నవి. కాశీపట్నమువలెనే ప్రతిసందుకు పాటక్కులనే వాకిళ్ళు తలుపులతోకూడా కట్టియున్నవి. రాత్రిళ్ళుమూశి గడియలు బీగము వేయుచున్నారు. బాజారులను బహునిర్బంధము మీద యిటీవల జాతులవాండ్లు వెడల్పుచేసి చక్కపెట్టినారు. యిండ్లకు బాడిగె యీ షహరులో బహు అల్పము. నేను దినానికి ఒక రూపాయివంతున నిలిచిన దినమునకు బాడిగె యిచ్చుచు వచ్చినాను. సకల పదార్థాలు సకల విధములయిన పనివాండ్లు సమృద్ధిగా దొరుకుదురు. పనివాండ్లను యీ దేశస్థులు కాలీగర్లు అని అనుచున్నారు. యీ షహరులో యెక్కా