పుట:Kasiyatracharitr020670mbp.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏనుగుల వీరాస్వామయ్య గారి

14 వ తేది ఉదయాన 4 ఘంటలకు లేచి యిక్కడికి ఆరుకోసుల దూరములో నుండే మురువారా అనే గళగ్రామము 10 ఘంటలకు చేరినాను. నడిమి వూళ్ళు: నెం.11 తెవురి 1 నయ్యగా 1 లక్కెపటారి 1 పిప్పరవేడు 1 దేవుడి 1 జింజరి 1 మురువారా 1. దారి నిన్నటిదారివలెనే శాలవేసి రమణీయముగా నున్నది. పయిమజిలీవూరు ముందరనే కాటిని అనే నది దాటవలసినది. యిక్కడ దోనెలు వేసి యున్నా నేను కాలినడకతోనే దాటినాను. దేవురి అనేవూరివద్ద నేవారు అనే నదిఒకటి దాటవలసినది. అదిమొదలుగా మురువారా చేరేవరకు చిన్న పర్వతాలు దారికి నిరుపక్కలా సమీపమున నున్నవి. పొడిచెట్లు అడివివలనె యున్నవి. ప్రతిదినమున్ను అక్కడక్కడ మనుష్యులు భాట మరామత్తు చేస్తూ శాలగా పెట్టియుండే చెట్లను పశువులు తినకుండా చుట్టు అడివికొయ్యలతో గ్రాదులు కట్టుచునున్నారు.

నాగపూరు మొదలుకొని ముఖ్యముగా జబ్బల్ పూరు మొదలు గానున్ను సకల స్త్రీలున్ను వృద్దులతొ గూడా బహు పనితనముగా అనేకవిధాలుగాచేసి వెండివలె శుభ్రముగా నుండే కంచు పాంజేబులున్ను మోచేతులకు పొడుగుగా ఆలోహముతోనే చేసిన కడియాలున్ను ధరించియున్నారు. భూమి సారవంత మయినది గనుకనున్ను దేహము పృధ్వీభూత సంబంధ మయినది గనుకనున్ను స్త్రీలు పురుషుల వలెనే కండపుష్టిన్ని దేహవర్ణమున్ను కలిగి యున్నారు. దేహ మాధ్యంతమున్ను పావడ పయిట రవికె వీటి చేత నిండుగా కప్పియుండడముగాక పురుషదర్శన మయినంతలో ముఖమునకుకూడా ముసుగు యీడ్చి కప్పుకోవడానకు మాత్రమే యిక్కడి స్తీలకు తెలుసును గాని దాక్షణాత్యులవలె చిన్నలు వన్నెలు కులుకులు బెళుకులు చేయడానికి యేపాటిన్ని తెలియదు. పనిపాటలు చేసే సామాన్య పురుషులు అందరున్ను తల మట్టుకు యిమిడేటట్టు ఒక కుళ్లాయివలె యేర్పరచి దానిచుట్టూ విశాలముగా ఒక చట్టము వెదురు దబ్బలతోనున్ను మదారపు ఆకులు మోదుగాకులతో నున్ను గొడుగు చందముగా యేర్పరచుకొని యెండకు వానకున్ను తలకు వేసుకొని నడుస్తూ బయలులో పనిపాటలు చేస్తూ వుంటారు.