పుట:Kasiyatracharitr020670mbp.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏనుగుల వీరాస్వామయ్యగారు బ్రౌను గారికి వ్రాసిన లేఖ 9

నేను చెన్నపట్టణం చేరిన తరవాత క్రీ|| శే|| లంగరుపాపయ్యగారి భార్యను కొమాళ్ళను కలుసుకొని వారిదగ్గరనున్న స్కాంద్దం *అనే గ్రంథంయొక్క వివరాలనడిగి తెలుసు కొన్నాను. ఈ స్కాంధంలో 6 సగుంహితలు 50 కాండ్డలు ఒకలక్ష గ్రంథం ఉన్నది. ఆ యారు సంగుహితల పేర్లు యేవనగా:-

  • సనత్కుమార సగుంహిత 1కి వీట్కి శ్లోకాలు 15000
  • సూతసగుంహిత 2 6000
  • బ్రంహ్మసగుంహిత 3 3000
  • వైష్ణవ సంహిత 4 5000
  • శంక్కర సంహిత 5 3000
  • సౌరసంహిత 6 1000

ఈ ఆరు సంహితలలో పాపయ్యగారు అయిదవదైన శంక్కర సంహిత నిర్దిష్టమైన చక్కని తెనుగు పద్యములలోని కనువదింపజేశారు. దానిని నేను తెచ్చినాను. తమరు పంపమంటే ఆ ఆరు సంహితలను బంగీలో పంపుతాను; లేదా శంక్కర సంహిత * తెనుగుతర్జుమా మాత్రమే పంపుతాను. ఏ సంగతిన్నీ తెలుపకోరుతాను.

ఈసారి కాశీయాత్ర చేయడంలో నేను కడప, హైదరాబాదు, నాగపూరు, జబల్‌పూరు, మిరిజాపూరు, అలహాబాదుల మీదుగా పోయినాను. తిరిగి వచ్చేప్పుడు నేను ఘాజీపూరు, చప్రా, పట్నా, గయ, కలకత్తా, పూరీ (జగన్నాధము) గంజాము మీదుగా అన్ని ఉత్తరజిల్లలలోనుండీ వచ్చాను. దీనిని గురించి సరియైన వృత్తాంతము వ్రాస్తూ వచ్చాను. ఈ వృత్తాంతంలో హైందవ పుణ్యస్థలము లన్నిటి యొక్క చరిత్రలు మహానదుల చరిత్రలు మొదలైనవి వ్రాశాను. హిందూ మహమ్మదీయ క్రైస్తవమతములను గురించీ హిందూపురాణములను గురించీ జ్యోతిచ్ఛాస్త్రమును గురించీ చర్చించాను. మఱిన్నీ నేను చూచిన ఆయా ప్రదేశాములలోని ప్రజల యాచారాలు వ్యవహారాలు వానిలో ఒకచోటుకు ఇంకొకచోటుకు భేదములుండడానికి గల కారణాలున్నూ వర్ణించాను.

ఈ పుస్తకము చాలమంది కావలెనంటున్నారు. మచిలీపట్టణంలో మీరు స్థాపిస్తామని సెలవిచ్చిన ముద్రాక్షరశాలలో యీ పుస్తకాన్ని అచ్చువేయించి మూడువందల ప్రతులు ప్రకటించడాని కవకాశముంటుందా? ఈ పుస్తకాలు శీఘ్రంగానే అమ్ముడుపోతాయని నా నమ్మకము. ఈ పుస్తకమిప్పుడు వ్రాతలో 400 అరఠావులున్నది. తమ సెలవైతే బంగీతపాలులో తమకొక ప్రతిని పంపుతాను. తమరు నెమ్మది మీద చిత్తగించి దానిపైన యభిప్రాయం దయచేయవచ్చును. ______________________________________________________________

  • ఈమాటలు అసలు ఉత్తరంలో కూడా తెలుగులోనే వున్నాయి.