పుట:Kashi-Majili-Kathalu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

కాదంబరి

ఆహా? కిన్నరమిధునానుసరణము నిష్ఫలమైనను ఇప్పుడీసరోవరము గనఁబడుటచే సఫలమనియే తలంతును. నాకుఁగన్నులు గలిగినందులకుఁ జూడదగినవస్తువును నేఁటికిఁజూచితిని. రమణీయమగు వానిలో నిదిచివరిదిగా భావింతును. దీనిసృష్టించిన స్రష్ట తిరుగా నమృత సరస్సేమికి నిర్మించెనోతెలియదు. ఇదియమృతమువలె సకలేంద్రియముల నాహ్లాదపెట్టుచున్నది. దీనింజూచియే భగవంతుఁడగు వాసుదేవుండు జలశయనమును విడువకున్నాడు. అన్నన్నా, అమ్మహానుభావుం డిట్టిదాని విడిచి లవణరసపరుషములగు జలధి జలముల నేటికి శయనించెనో తెలియదు. నిక్కము. ప్రళయకాలమం దిందలి జలలేశము గ్రహించి మహావలాహకములు భూమినంతయు ముంచు చున్నయవి.

అనియిట్లు విచారించుచు సికతాలతా వికసితమగు తదీయ దక్షిణతీరమునఁ దురగమును దిగి దానినీరుద్రాగించి యొక తరుమూలమునఁగట్టి యత్తటాకతీరమున మొలచిన దుర్వా ప్రవాళ కబళములఁగొన్ని స్వయముగాఁబెరికితెచ్చి దానిముందువై చెను.

తరువాత నాతడందుదిగి కరచరణములగడిగికొని చాతకమువలె జలముగ్రోలి స్మరశరాతురుండు బోలె నళినీదళముల నురమున దాల్చుచు గొంతసేపవ్విలాసమంతయుంజూచి తలయూచి మరలఁ దీరము జేరి యందొకశిలాతలంబునఁ దూఁడులతోఁగూడ నళినీదళంబులం గొన్ని బెరికికొనివచ్చి యాస్తరణముగావైచి యందు శిరంబునం జుట్టికొన్న యుత్తరీయము పరచి కూర్చుండెను.

ముహుత౯కాలమట్లు విశ్రమించినంత నాప్రాంతమున మేయుచున్న యింద్రాయుధము మేతమాని చెవులు నిక్కబెట్టుకొని యట్టె నిక్కి చూచుటయుఁ దత్కారణమరయ నతనిచెవులకు వీణాతంత్రీ ఝుంకారమిశ్రితమగు నమానుషగీత మొండు వినంబడినది.