పుట:Kashi-Majili-Kathalu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తారాపీడుని కథ

21

వ్యర్ధము కాఁజాలదు. దేవీ! నీకేమని వక్కాణింతును. రాత్రింబగళ్ళు ననపత్యతాదుఃఖాగ్ని నన్ను దహించుచున్నది. రాజ్యంబును జన్మంబును విఫలమని తలంతును. తలోదరీ! కమల గర్భుండు మనకు ప్రసన్నుఁడుగాడయ్యెను. నేనేమి జేయుదును. నీ శోకానుబంధము విడువుము ధైర్యమవలంబింపుము. బుద్ధిని ధర్మకార్యములందుఁ బ్రవేశబెట్టుము. అని శోకాపనోద నిపుణంబులగు ప్రియవాక్యంబులచే నత్తలోదరి నాశ్వాసించి కొంతతడనందుండి యతండు నిజభవనంబున కఱిగెను.

అది మొదలమ్మదవతియు దేవతారాధనములయందు బ్రాహ్మణ పూజలయందును వెనుకటికన్నఁ బెద్దగా నాదరముగలిగియుండెను. పుత్రోదయ హేతుభూత మగు వ్రత మెవ్య రెట్టిది చెప్పినను గష్టముల కోర్చి యట్టిదిగావించునది. చండికాయతనంబుల శయనించి యనేకోపవాసములఁ గావింవినది. వృద్ధగోపవనితలు మన్నింప సర్వలక్షణ సంపన్నంబులగు గోవుల పొదుగులదాపున నిలచి సర్వౌషథీమిశ్రితంబులగు పాలతో స్నానంబు గావించినది. కనకమణి వినిర్మితములగు తిలపాత్రముల దానములిచ్చినది. అనేకసిద్థాయతనముల సేవించినది. ప్రసిద్ధములగు నాగహ్రదంబుల మునింగినది. అశ్వద్ధప్రభృతివనస్పతులకుఁ బ్రదక్షిణము లొనర్చినది. నడివీధుల దథ్యోదనము వాయసములకు బలివైచినది. భక్తితో నగ్నక్షపణకాదుల నెందరినో ప్రశ్నలడిగినది. నిమిత్తజ్ఞుల నారాధించినది. వృద్ధులు జెప్పిన రహస్యక్రియలన్నిటిని గావించినది. ఉపశ్రుతుల నాలించినది. నిమిత్తముల గ్రహించినది. తనకువచ్చు స్వప్నవిశేషంబులు గురువులకు నివేదించునది.

ధృతవ్రతయై యయ్యువతి యట్లు చేయుచుండ నొకనాఁడు తారాపీడుండు అల్పావశేషమగు రాత్రియందు సమున్నత సౌధాగ్ర వర్తినియై యున్న విలాసవతీదేవి మొగంబున సకల కలాపరిపూర్ణుం