పుట:Kashi-Majili-Kathalu.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కపింజలునికథ

157


లేవా? తండ్రీ! భువనత్రయత్రాణ సమర్ధుండవు స్వయముగాఁ బెనిచిన నీకులతంతవునగు నన్నీయాపదనుండి రక్షింపుము వయస్యా! కపింజల! నీవు వేగవచ్చి నాకీయాపద దాటింపకపోయితివేని జన్మాంతర మందైన నిఁక నాతోఁ గలసికొనఁజాలవుసుమీ? అని యనేక ప్రకారముల విలపించుచు వెండియు వినయముతో వాని నిట్లు ప్రార్థించితిని.

చంద్రముఖ! నాకు జాతిస్మృతిగలదు. నేనొక మునికుమారుండను. ఈసంకటమునుండి నన్ను దప్పించిన నీకును బుణ్యమురాఁగలదు నన్ను బట్టి నట్లెవ్వరును జూచియుండలేదు. విడిచినచో నీకుఁబ్రత్యవాయమేమియుం గలుగదు. కావున గరుణించి నన్ను వదలుమని బ్రతిమాలు కొనుచు వానిబాదంబులం బడితిని. పక్కుననవ్వి వాఁడు నా కిట్లనియె. ఓరీ! మోహాంధుఁడా! శుభాశుభకమ్మలకు సాక్షిభూతములగు పంచభూతములు నీశరీరమున లేవా? అవి చూచుచుండవా? అకార్యకరణమునకు నే నంగీకరింపను. స్వామ్యాజ్ఞచే నిన్నుఁ బట్టికొంటిని వదలుటకు వీలులేదని పలుకుచు నన్నుఁతీసికొని పక్కణాభిముఖుండై యరుగు చుండెను. నేను వానిమాటచే నెత్తిపైఁ గొట్టబడినట్లు మూకీభావము వహించి యేపాపముజేసి యిట్టిఫల మనుభవింపుచుంటినో యని ధ్యానించుచుఁ బ్రాణములు విడుచుటకు నిశ్చయించుకొంటిని. మఱియు వానితో నట్లుతీసికొని పోఁబడుచున్న సమయంబున ముందుజూచినంత,

సీ. కుక్కలతోఁ గూడికొని గుంపు గుంపుగా
              చండాల బాలకుల్ సంచరింప
    దూషితమాంస మేదో వశాకర్దమ
              ప్రాయకుటీరాజితములు వెలయ
    గుడిసెల చుట్టు బల్ గోటగాఁ గట్టిన
              వెదుర కంపల దడుల్ వీథులంట