పుట:Kashi-Majili-Kathalu.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

142

కాదంబరి

అప్పుడు తత్కరసంపర్కంబునంజేసి చంద్రాపీడునిదేహమునుండి యద్భుతతేజం బొండు బయలువెడలి యాప్రాంతమంతయుఁ దుషార మయముగావింపుచు నంతరిక్షములోఁగలసి యశరీరముగా నిట్లుపలికినది.

కాదంబరీ! నీవు చింతింపకుము. చంద్రాపీడుఁడు శాపదోషంబునఁ బ్రాణములఁబాసెను. వీనిశరీరమును విడువక నీవు కాపాడుచుండుము. శాపాంతమందుఁ గ్రమరజీవించు నీశరీరమున కగ్నిసంస్కారము చేయవలదు. నీకరసంపర్కంబునఁ దేజంబు దప్పక యట్లే యుండునని పలికినవిని యందరు శిరములెత్తి రెప్పలువాల్పక గగనమును జూడఁ దొడంగిరి.

అప్పుడు పత్రలేఖయుఁ దస్తేజస్తుషారాశీతలత్వమునం దెప్పిరిల్లిలేచి యావేశించిన దానివలె పరుగిడి యింద్రాయుధము కళ్ళెము పట్టుకొని చంద్రాపీడుఁడు లేక మనమేటికని పలుకుచు నాతురగమును లాగికొని పోవుచు దానితోఁగూడ నచ్ఛోదసరస్సులో దుమికెను.

ఆవెంటనే యాసరస్సులోనుండి తాపసకుమారుం డొకండు బయలువెడలి దూరమునుండి చూచుచున్న మహాశ్వేతదాపునకుఁ బోయి శోకగద్గదస్వరముతో గంధర్వరాజపుత్రీ! నన్నెఱుంగుదువా యని యడిగెను.

అప్పు డప్పడతియు శోకానంద మధ్యవత్తియై తొందరగా లేచి యతనిఁ నమస్కరించుచు దేవా! కపింజల! పాపాత్మురాలనగు నేనిట్లు సిగ్గులేక పుండరీకుఁడు స్వర్గగతుఁడైనను జీవించియుంటిని. అతం డెచ్చటికిఁబోయెను. ఎందుండెను? నీవెప్పుడైనఁ జూచితివా? యాతనివిడిచి నీవొక్కరుండవు వచ్చితివేమని యడిగెను.

అప్పుడు చంద్రాపీడుని పరిజన మతనిం జుట్టుకొని వింతగాఁ జూడఁదొడంగెను. పిమ్మటఁ గపింజలుఁ డామెతో నిట్లనియె.