పుట:Jyothishya shastramu.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంబంధించిన కర్మలు రెండవ స్థానమున ఉండును. ఉదాహరణకు ఒక మనిషి 60 సంవత్సరములు బ్రతికి చనిపోతే ఆ అరవై సంవత్సరముల ఆయుష్షులో ఎంతకాలము అజ్ఞానిగా బ్రతుకును అనుటకు సమాధానముగా అతని రెండవ స్థానమున ఉన్న ప్రపంచ కర్మనుబట్టి 50 సంవత్సరముల కాలము అజ్ఞానములో బ్రతికాడనీ, మిగత పది సంవత్సరముల కాలము జ్ఞాన జీవితములో గడచిపోయినదని చెప్పవచ్చును. ఒక మనిషి ఎంత కాలము అజ్ఞానములో గడుపునని రెండవ స్థానమునుబట్టి చెప్పినట్లే, అదే మనిషి ఎంతకాలము జ్ఞానజీవితము గడుపునో అతని కర్మచక్రములోని ఎనిమిదవ స్థానమును చూచి చెప్పవచ్చును. ఇక్కడ ముఖ్యముగా అందరూ గమనించ వలసినదేమంటే! ఒకని జీవితములో ఎంత భాగము అజ్ఞాన జీవితము, ఎంత భాగము జ్ఞానజీవితము ఉండునో చెప్పవచ్చునుగానీ, మనిషియొక్క ఆయుష్షును గురించి ఎవరూ చెప్పలేరు. మనిషి జీవితములో చావు పుట్టుకలు కర్మాధీనములు కావు. అవి కర్మకు అతీతమైనవిగా ఉన్నవి. అందువలన మనిషి తన జీవితములో ఇంత భాగము అజ్ఞాన జీవితము గడుపునని చెప్పవచ్చును. అలాగే ఎంతకాలము జ్ఞానజీవితమును గడుపునో చెప్పవచ్చును. ఈ రెండు స్థానములను చూచి ఇతనికి ఇంత ఆయుష్షుంటుంది అని కొందరు చెప్పవచ్చునుగానీ అది సత్యమైన మాటయని చెప్పలేము. 2,8 స్థానములనుబట్టి వాడు అజ్ఞానమార్గములో పయనించునా లేక జ్ఞానమార్గములో పయనించునా అని చెప్పవచ్చును. మనిషికి వంద సంవత్సరములు ఆయుష్షు అని 2,8 స్థానముల కర్మనుబట్టి అంచనాగా వంద సంవత్సరములలో ఇంతకాలము బ్రతకగలడనీ, వీని ఆయుష్షు ఇంత అని చెప్పుచుందురు.