పుట:Jyothishya shastramu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ విధముగా గుణచక్రము, మూడు భాగములుగా ఉంటూ అందులో పక్ష, ప్రతిపక్ష గుణములు 12 రకములుగా ఉన్నవి. వాటిలో ఒక్కో గుణము 9 రకముల పరిమాణముగ చీలి ఉన్నవి. ఈ 108 గుణములనే భగవద్గీతలో మాయ అని చెప్పారు. గుణముల మాయనుండి ఉత్పన్నమైన కర్మ అనునది కర్మచక్రమును చేరి, పైనున్న కాలచక్రములోని పండ్రెండు గ్రహముల చేత, తిరిగి మానవుని మీద కష్టసుఖముల రూపముతో ప్రసరింపబడుచున్నది. దానిని ముందుగా తెలుసుకోవడమునే జ్యోతిష్యము అంటున్నాము. ఇది జ్యోతిష్యశాస్త్రము కావున గుణములను, కర్మలను, గ్రహములను చెప్పుకోవలసివచ్చినది.

22. గుణములను ప్రేరేపించునది కర్మనా? లేక కాలమా?

గుణచక్రములోని గుణములను ప్రేరేపించునది కర్మయేనని చెప్పవచ్చును. కర్మను కదలించునది కాలమని చెప్పవచ్చును. నాలుగు చక్రముల అమరికలో బ్రహ్మచక్రము అన్నిటికీ గొప్పది, అన్నిటికీ అతీతమైనది. దానిని పేరుకు మాత్రము గుర్తుగా పెట్టుకొన్నాము. అందువలన ఏ మనిషికైనా క్రింది మూడు చక్రములే ముఖ్యములని చెప్పవచ్చును. ఆ మూడు చక్రములలో మధ్యలో గలది కర్మచక్రము. కర్మచక్రము పైన కాలచక్రమూ, క్రింద గుణచక్రమూ గలదు. మధ్యలోగల కర్మను అనుసరించియే క్రింద గుణచక్రమూ, పైన కాలచక్రము యొక్క నిర్మాణమున్నది. కావున ఈ మూడు చక్రములను కలిపి కాల, కర్మ, గుణ చక్రములని చెప్పినప్పటికీ, ఆధ్యాత్మిక విద్యలో మూడు చక్రములను కలిపి కర్మచట్రము అనియూ, కర్మ లిఖితము అనియూ, కర్మపత్రము అనియూ,