పుట:Jyothishya shastramu.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుజగ్రహము ఎక్కడున్నా, దానికి ఆ స్థానములలో ఉపయోగపడు చేయికాక మిగత మూడు చేతులుండును. ఆ మూడు చేతులలోని ఒక చేయిని కుజగ్రహమున్న చోటనుండి నాల్గవ స్థానములోనికి, రెండవ చేయి ఏడవ స్థానములోనికి, మూడవ చేయిని ఎనిమిదవ స్థానములోనికి ఉంచి అక్కడగల వాటిని తీసుకొని జాతకునికి అందివ్వగలదు. ఆయువు స్థానము కుండలిలో ఎనిమిదవ స్థానముకాగా, ఆయువుకు అధిపతి శని గ్రహము. ఇప్పుడు చూసిన జాతక లగ్నములో ఐదవ స్థానములో శని ఉండడము వలన రెండవ స్థానమున కుజుడు ఉండుట వలన కుజుడు తన చేతితో తనకు నాల్గవ స్థానములోనున్న శనిని తాకి శనివద్దయున్న జాతకుని ఆయుష్షును హరించుటకు అవకాశము గలదు. ఆయుష్షు శనిది. ఆయుష్షు స్థానము ఎనిమిదవ స్థానము. ఎనిమిదవ స్థానమును స్వయముగా కుజగ్రహము రెండవ స్థానమునుండి ఆక్రమించుకొన్నది. ఆయుష్షుకారకుడైన శనిని కూడా తన చేతి తాకిడితో దాడిచేసి శనివద్దయున్న ఆయుష్షును లాగుకొనుటకు సిద్ధముగాయున్నది. అంతేకాక తమ గుంపు నాయకుడైన గురువుతోగానీ, మిగత తమ గుంపు గ్రహములతో కలిసినప్పుడు జాతకుని ఆయుష్షును లాగుకొనుట చేయవచ్చును. జాతకుని ఆయువును లాగుకొనునప్పుడు అనగా జాతకున్ని చంపివేయునప్పుడు కుజ గ్రహము ఆధీనములోనున్న ఆయుధములనుగానీ, కౄర మృగములనుగానీ ఉపయోగించవచ్చును. ఆయుధములలో ఉత్తమ శ్రేణికి సంబంధించినవి బాంబులు, తుపాకులుకాగా, మధ్యమ శ్రేణికి సంబంధించినవి అనేక రకముల పదునైన కత్తులుకాగా, తక్కువ శ్రేణికి సంబంధించిన కోరలుగల మృగములు ఆయుధములుకాగా తన ఆధీనములోనున్న ఏదో ఒక శ్రేణి ఆయుధముల చేత మనిషిని చంపును. అని ఆ జాతకము నుండి మనము తెలుసుకోవచ్చును.