పుట:Jyothishya shastramu.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కర్మగలవానికి తాను పని చేయుచున్న యజమానికి గల పెద్ద అంతస్థుల భవనములో వాచ్‌మేన్‌గా నైనా లేక పని మనిషిగానైనా ఉండునట్లు చేసి ఆ ఇంటిలో నివాసము కల్గునట్లు చేయును. ఎందరో బీదవారు తమది కాని పెద్ద భవనములో వర్క్‌మ్యాన్‌గానో, వాచ్‌మ్యాన్‌గానో, వాటర్‌మ్యాన్‌గానో ఉంటూ యజమాని తన ఇంటిలో లేకున్నా తానుమాత్రము ఉంటున్నాడు. ఈ విధముగా సూర్యుడు అనుకూలించిన వారికి కలుగును. ఇలా అనుభవించవలెనను కర్మ నాల్గవ ఇంటిలోనున్నప్పుడు ఆ స్థానములోనికి సూర్యుడు వచ్చినప్పుడు అలా జరుగునని తెలియవలెను. నాల్గవ ఇంటిలో పాపమున్నప్పుడు సూర్యుడు అనుకూలుడై వచ్చినా అటువంటి సుఖములను సూర్యుడు ఇవ్వడు. ఒకవేళ సూర్యుడు శత్రుగ్రహమై వస్తే గృహమునకు సంబంధించిన సుఖములు అంతవరకున్నా అప్పుడు లేకుండా చేయుటకు ప్రయత్నించును. ఉన్న పెద్ద ఇల్లును కూడా అమ్మి చిన్న ఇల్లును కొందామనుకొనును. ఈ విధముగా మనిషియెడల సూర్యగ్రహము పనిచేయుచున్నది. జాతక లగ్నమునకు నాల్గవ స్థానములో రవి యున్నప్పుడు ఇలాంటి ప్రేరణ చేయును. జాతక లగ్నములో సూర్యుడు ఏ రాశిమీద ఉండునో జీవితాంతము ఆ రాశికి సంబంధించిన కార్యములనే ప్రేరేపిస్తూ మనిషికి కష్టసుఖములను కల్గించుచుండును. ఏ జాతకునికైనా జాతక లగ్నములో ఏయే రాశుల మీద ఏయే గ్రహములుండునో దాని ఫలితమును బట్టి జీవితములో ఉండును. కాలచక్రములో తిరుగుగ్రహములు తిరిగి ఆ రాశిమీదికి వచ్చినప్పుడు మొదటి లగ్నము ప్రకారమే ఫలితముల నిచ్చుచుందురు. ఇప్పుడు చంద్రునికి ప్రపంచములో ఏయే వస్తువుల మీద అధికారము కలదో తెలుసుకొందాము.