పుట:Jyothishya shastramu.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చనిపోయినా, ఎన్నిమార్లు క్రొత్త జన్మకు పోయినా వాటిని దేవుని దృష్ఠిలో అన్ని జన్మలుగా లెక్కించబడవు. 120 సంవత్సరములకు ఒక జన్మగా లెక్కించుటకు నిర్ణయము చేయబడినది. 120 సంవత్సరములు గడచితేనే ఒక జీవితము లేక ఒక జన్మగా లెక్కించుటకు శాసనము చేయబడినది. మనిషికైనా వేరు జంతువుకైనా, ఇతర క్రిమికైనా ఒకే నిర్ణయము ప్రకారము 120 సంవత్సరములకొకమారు జన్మగా గుర్తించవచ్చును. 120 సంవత్సరములలో ఒక జంతువు లేక ఒక మృగము ముప్పదిమార్లు చనిపోయి తిరిగి జన్మించినా అవన్నియు అన్ని జన్మలుగా లెక్కించబడక ఒకే జన్మగా లెక్కించ బడును. దానికి సూత్రము కలదు. మానవుని గ్రహచారములో పన్నెండు గ్రహములున్నట్లే, దశాచారములో కూడా పన్నెండు దశలు కలవు. పన్నెండు దశలు ఒకమారు అయిపోవుటకు మొత్తము 120 సంవత్సరముల కాలము పట్టును. అలా పన్నెండు దశలు ఒకమారు తిరిగినప్పుడే ఒక జన్మగా లెక్కించవచ్చును. సూర్యదశతో ప్రారంభమైన దశ తిరిగి వాని జీవితములో వచ్చుటకు 120 సంవత్సరముల కాలము పట్టుచున్నది. అందువలన ఎవనికైనా 120 సంవత్సరములకు ఒకమారు జన్మయని లెక్కించవలెను. మనిషి జీవితములో పన్నెండు దశలున్నవని తెలుసు కొన్నాము కదా! పన్నెండు దశలు కలిసి మొత్తము 120 సంవత్సరములని అనుకొన్నాము కదా! అయితే పన్నెండు దశల కాలము సమానముగా యున్నదా? లేక ఒక్కొక్క దశ ఒక్కొక్క కాలపరిమితికల్గియున్నదా అను ప్రశ్నకు జవాబును తెలుసుకొందాము. గ్రహచారములోని పన్నెండు గ్రహములలో ఆరు గ్రహములు మిత్రులుగా, ఆరు గ్రహములు శత్రువులుగా యున్నట్లు, దశలలో కూడా ఆరు దశలు మంచివిగా, ఆరు దశలు చెడువిగాయున్నవి. వాటిని క్రింద చూస్తాము.