పుట:Jyothishya shastramu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భూతకాలమును తెలుసుకొను మనోనేత్రము యొక్క చూపు (జ్ఞాపకశక్తి) కొందరికుండవచ్చును, కొందరికి ఉండకపోవచ్చును. కానీ వర్తమాన కాలమును తెలుసుకొను బాహ్యనేత్రముల యొక్క చూపు అందరికీ ఉందనియే చెప్పవచ్చును. ఇకపోతే భవిష్యత్‌ కాలమును తెలుసుకొను జ్ఞాననేత్రము, నూటికి తొంభై మందికి లేదనియే చెప్పవచ్చును. కేవలము పదిశాతము మందికి జ్ఞాన నేత్రముండినా, అది చూపులేని గ్రుడ్డిదై ఉన్నది. అందువలన భవిష్యత్‌ కాలము ఎవరికీ తెలియకుండ పోయినది. జ్ఞానులమనుకొన్న కొన్ని వేలమందిలోనో, లేక కొన్ని లక్షలమందిలోనో ఒకనికి జ్ఞాననేత్రము చూపు కల్గినదై ఉండును. అటువంటివానికి మాత్రమే జ్యోతిష్యము తెలియును. అట్టివాడు మాత్రమే భవిష్యత్‌ను తెలుసుకోగల్గును. మూడు కాలములకు మూడు నేత్రములు అవసరమని, అందులో జ్ఞాననేత్రము చాలా ముఖ్యమైనదని తెలిసి, చూపున్న జ్ఞాననేత్రమును కల్గినవాడు నిజమైన జ్యోతిష్యుడని తెలియవలెను. జ్ఞాననేత్రము లేకుండ పంచాంగములను తెలిసినవాడు జ్యోతిష్యుడు కాదు.

4. జ్యోతిష్యము మనుషులకేనా? జంతువులకు కూడ వర్తిస్తుందా?

జరుగబోవు కాలములో జీవులకు సంభవించు కష్టసుఖములను ముందే తెల్పునది జ్యోతిష్యము. జీవులు భౌతిక శరీరముతో ఉన్నపుడుగానీ, సూక్ష్మశరీరముతో ఉన్నపుడుగానీ అనుభవించు కర్మను ముందే తెల్పునది జ్యోతిష్యము. జీవులు స్త్రీశరీరముతోనున్నపుడుగానీ, పురుషశరీరముతో నున్నపుడుగానీ అనుభవించు వాటిని గురించి సూచనగా ముందే తెల్పునది జ్యోతిష్యము. అలాగే జీవులు మానవ ఆకారములోనున్నపుడుగానీ, జంతువు