పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ ముసలి దంపతులు బింకం పట్టుకున్నంత కాలం ఉన్నారు. జెన్నీ భర్త కోర్కె చొప్పున తమ క్షేమ సమాచారాలను గూర్చి తలిదండ్రులకు ఉత్తరాలు రాస్తూ ఉండేది. పెద్దన్నగారు పెషావరునుంచి యూరపు వెళ్ళిన సేనలలో ఉన్నాడు. అతనికి ఆయన భార్యకూ ఎప్పుడూ జెన్నీ ఉత్తరాలు రాస్తూ ఉండేది. మేజరు భార్యా బిడ్డలు అందరూ మదరాసులో జెన్నీ తలిదండ్రుల దగ్గర ఉండినారు.

జెన్నీ ఎంతమందికి ఎన్ని ఉత్తరాలు రాసినా లయొనెల్ తప్ప చుట్టాలెవ్వరూ ప్రత్యుత్తరాలైనా వ్రాసేవారు కారు. అందువల్ల జెన్నీ కూడా వాళ్ళకు ఉత్తరాలు రాయడం మానివేసింది. తలిదండ్రులు జెన్నీకి ఉత్తరం రాయకుండా బొంబాయి వచ్చేశారు.

ఆమెతో ఫోనులో మాట్లాడడానికి తల్లి వచ్చింది.

"జెన్నీ!"

“మమా!”

“ఎన్నాళ్ళయింది నీ గొంతుక విని!”

“మమా! నువ్వు నన్ను ముద్దు పెట్టుకు ఎన్నాళైంది?”

“జెన్నీ ఏమంటావు?”

“మీ ఇద్దరూ మా ఇంటికి రావాలి!”

“నీ భర్తను కలుసుకోడానికి నీ డాడి కిష్టంలేదు -”

“ఇన్నాళ్ళనుంచీ నా మొగమే చూడనన్న డాడీ ఇప్పుడు బొంబాయికి రాగలిగినాడు. ఇంతవరకు వచ్చి మా ఇంటికి రావడానికి మీ ఇద్దరి కభ్యంతరం ఏమిటి? అంత అభ్యంతరమే ఉంటే నన్ను చూడకుండానే తిరిగి మదరాసు వెళ్ళండి!”

“అయ్యో!” విచారయుక్త స్వరపూరితమయి ఆమె మాటలు జెన్నీ హృదయాన్ని పిండిచేసినాయి. అయినా ఆశయాలలో మెత్తబడటం ఉండకూడదని పళ్ళు బిగించుకొని, “మమా! ఇక సెలవు పుచ్చుకుంటాను -” అన్నది..

ఆమె తల్లి హృదయంలో బాధపడినట్లు “అయ్యో” అన్నది. మళ్ళీ ఇంతట్లో జెన్నీ తండ్రి ఆ ఫోను రిశీవరు తీసుకొని, 'జెన్నీ'ని పిలిచాడు.

“ఏమిటి డాడీ! నువ్వేనా?” అన్నది జెన్నీ.

“నేనేనమ్మా! నేనే! నేను ఆలోచించిన కొలదీ నిన్ను ఇక్కడకు రమ్మన మనడం తప్పుగానే కనబడింది. మేము ఇద్దరం అక్కడికి రేపు ఉదయం మీకు అతిథులుగా వస్తున్నాము. ఈ విషయం నీ భర్తతో చెప్పు. నీ భర్త చాలా ఉత్తముడు. ప్రజ్ఞాశీలి. అతడు నా అల్లుడవడం నాకెంతో గర్వకారణం అని అనుకుంటున్నానని కూడా చెప్పు.” అని ఆ వృద్ధుడు గంభీర కంఠంతో అన్నాడు.

వారిద్దరూ ఒకరి దగ్గర ఒకరు సెలవు తీసుకొన్నారు. జెన్నీ నాట్యం చేసింది. సాయంకాలం భర్త రాగానే తన తలిదండ్రులు ఇద్దరూ తమ అతిథులుగా వస్తున్నారని చెప్పింది.

అడివి బాపిరాజు రచనలు - 7

87

నరుడు(సాంఘిక నవల)