పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“ఏమిటా బడాయి?”

“నాకెందుకు బడాయి?”

“అంత అందమైన భార్య తనకే ఉన్నదని అందరు అనుకుంటారనీ!”

“ఆ గుహలు తిరిగి తిరిగి, ఆ ప్రదేశ సౌందర్యంలో మునిగిపోయి, మతులుపోయి వదలలేక వదలలేక, తిరిగి బొంబాయి ప్రయాణం అయ్యారు.

3

వీరు బొంబాయి చేరేసరికి ఎల్లమందమూర్తి ప్రణాళిక ప్రభుత్వంవారు ఒప్పుకున్నట్లూ, పని వెంటనే ప్రారంభించమనీ కాగితాలు వచ్చి వున్నాయి.

మూర్తి పక్కన ఉన్న భార్యను కౌగలించుకొని ఆమెతో నాట్యం చేయసాగినాడు.

ఇద్దరూ వెంటనే లోనవాలా పరుగెత్తినారు. ఆ మరునాటినుండి మూర్తి పనిలో మునిగిపోయాడు. వేలకొలది మేస్త్రీలు మూర్తి అనినా, జెన్నీ అనినా ఎంతో గౌరవంతో భక్తితో మెలగసాగినారు. జెన్నీ వారందరికీ ఎంతో ప్రేమతో వైద్యం చేస్తూ ఉంటుంది. ఒక్క పైసా పుచ్చుకోదు. ఆ పని మనుష్యులలో స్త్రీలకు ఎంత మందికో జెన్నీ పురుడు పోసింది.

లోనవాలాలో జెన్నీ వేరే ఒక ఇల్లు పుచ్చుకొని వైద్యాలయం ప్రారంభించింది. పనివాళ్ళల్లో ఇద్దరి బాలికలకు నర్సుల పని నేర్పింది. జెన్నీ పెళ్ళయి వచ్చిన కొత్త రోజులలోనే లయనెల్ మదరాసులో ఉన్న ఆమె మందులూ శస్త్ర వైద్యపు పనిముట్లూ అన్నీ పంపించాడు. ఆమె బొంబాయిలోను చాలా మందులూ పరికరాలు కొనుక్కున్నది.

ఈ వైద్యంతోపాటు చుట్టుపక్కల ఉన్న పర్వత నగరాలలో కాపురమున్న పెద్ద కుటుంబాలవారికీ, పాశ్చాత్యులకూ నెమ్మదిగా ఈమె వైద్యురాలయింది. దానివలన బాగా రాబడి రా నారంభించింది.

ఈలోగా తన భర్తకు ఆమే కోటి విధాల ఆలోచన చెబుతూ హుషారు ఇస్తూ వున్నది.

మూర్తి ఆ కొండరూపం మార్చినాడు. అమెరికాలో నేర్చుకొన్న విద్యకు అవసరాన్ని బట్టి ఇంకా కొత్త విధానాలు చేర్చి పనిని మహావేగంగా ప్రజ్ఞాపూర్ణంగా సాగిస్తున్నాడు. మూర్తి చేయించే పనిని చూడవలసిందని ప్రభుత్వం దేశ దేశాలనుంచి ఇంజనీర్లను పంపింది. మూర్తి దగ్గర పని నేర్చుకొనడానికి యువక ఇంజనీర్లెంతమందినో పంపించింది. వారందరూ మూర్తిగారి అఖండ విజ్ఞానమూ, కార్యాలోచనా నిశితత్వమూ చూచి ఆశ్చర్యం పొందినారు.

4

1940 సంవత్సరం మే నెలలో జెన్నీ తండ్రి, తల్లీ ఇద్దరూ బొంబాయి వచ్చి కొమరితను చూడడానికి రమ్మనమని ఉత్తరం వ్రాసినారు. జెన్నీ వెంటనే వారున్న తాజ్‌మహలు హోటలుకు తాను రావడానికి వీలులేదనీ, తనకు హాస్పిటలుపని తల మునిగినంత ఉన్నదనీ, కాబట్టి తల్లిదండ్రులే ఇద్దరూ రావలసిందని ఫోను చేసింది.

అడివి బాపిరాజు రచనలు - 7

86

నరుడు(సాంఘిక నవల)