పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 కూచున్నాడు. ఈలాంటి సంఘటన ఏదైనా రావచ్చునని అతడనుకున్నాడు. కాని, ఇంత రాక్షసంగా సంధానిస్తుందని అతడు తన ఊహా విశ్వంలో ఎప్పుడూ, ఏ విధంగా అనుకోలేదు.

హిందూమతంలో వర్ణభేదం ఏర్పడడానికి, ఇదే కారణం. బంగారం కూడా వెండిని నిరసిస్తుంది. రాక్షసిబొగ్గు బొగ్గుని నిరసిస్తుంది. ఆర్యులు, పసిమిరంగు సుమేరియనులను, వారు గోధుమరంగు దస్యులను, వారు నల్లనిరంగు రాక్షసులను అసహ్యించుకొనేవారు. ఆర్యులంతా మొదట ఒకేరంగు. వారే ద్విజులై ఉంటారు.

తెల్లవాళ్ళకు రంగుల వాళ్ళంటే కడుపుమంట. అంతే కాబోలు చటుక్కున ఎల్లమంద లేచినాడు. ఏమీ పని పూర్తి చేసుకోకుండా కారు ఎక్కి తన ఇంటికి చేరుకున్నాడు. ఇంటిలో జెన్నీ లేదు.

అతని గుండె పదినిముషా లాగినట్టయింది. “జెన్నీ! జెన్నీ!” అంటూ గదులు వెదికాడు. చప్రాసీ, పనిమనిషి పరుగునవచ్చి “సాబ్! ఒక మిలిటరీ సాహెబ్ వచ్చి, పది నిముషాలు దొరసానితో మాట్లాడి తన కారుమీద ఎక్కించుకొని పోయినాడు.” అని చెప్పినాడు.

ఎల్లమంద వారి మాటలు విన్నాడన్న మాటేగాని, అసలు తాను ఏమి చేస్తున్నదీ అతనికి తెలియలేదు. గదులన్నీ ఆమెకోసం వెదుకుతూ వెదుకుతూ తిరుగుతున్నాడు. ఆమె నివసించిన గదిలోని అద్దానికి తగిలించి ఒక ఉత్తరం ఉంది..

“ప్రియతమా! మా మేజరు అన్న పెషావరునుంచి వచ్చాడు. అతని భార్య, మా వదినకు చాలా జబ్బుగా ఉందట. కాబట్టి వెంటనే రమ్మనమని ఈ సాయంకాలం మూడు గంటల బండికి బయలుదేరమన్నాడు. నీతో చెప్పి వస్తానంటే వ్యవధి లేదన్నాడు. ఈ ఉత్తరం రాసి మూడు గంటల బండికి వెళ్తున్నాను. అక్కడినుంచి ఉత్తరం రాస్తాను. నిన్ను ఇలా వదలి వెళ్ళడం, నా ప్రాణం, నా మనస్సు ఇక్కడే వదలి వెడుతున్నాను. ఇంతే సందర్భం. ఇంత తొందరయినది ప్రాణాధికా! నీకు కోటి కోటి ముద్దులు, శతకోటి కోటి కౌగిలింతలు - హృదయ ప్రభూ! నువ్వులేని సమయంలో సిగ్గువదలి నా ప్రభువు అని కంఠమెత్తి పిలుచుకుంటున్నాను. అన్న తొందరపెడుతున్నాడు, సెలవు.

నీ పెదవుల నా పెదవులు

గాఢంగా ఆనించి

"నీ జెన్నీ"

అని ఉత్తరం చదువుకొన్నాడు.

పెద్ద నిట్టూర్పు విడిచి కుర్చీపై కూలబడిపోయినాడు. లోకం అంతా నల్లబడింది. ఒళ్ళు చెమటలు పోసినాయి.

“నా దివ్యమూర్తి నా జన్మనే వదలి వెళ్ళిపోయిందా!” అని పైకి అనుకున్నాడు.

జెన్నీ గుడ్డలు, కొన్ని స్త్రీలకు గోప్యమైన లోని దుస్తులు ఆమె ఉపయోగించు సబ్బు అవీ ఉన్న పెట్టె అక్కడే ఆమె నుంచి వెళ్ళిపోయిన విషయం అతడు కనిపెట్టినాడు.

అవి అన్నీ తీసి పెదవులతో చుంబించి, హృదయాని కదుముకొని, ఒక తోలుపెట్టెలో అన్నీ సర్ది తాళం వేసుకున్నాడు. అతడు ఆ రాత్రంతా నిద్రలేకుండా తిరిగినాడు. ఆ


అడివి బాపిరాజు రచనలు - 7

66

నరుడు(సాంఘిక నవల)