పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“అది వట్టిమాట! జపానువాళ్ళ మాటో? దేహబలం అంటావా జోలూ యీ మూట? పైగా నిన్న మొన్నటివరకు తెల్లవాళ్ళ నాగరికత ఎంత? ఏవో కొన్ని ప్రస్తుత స్థితులను బట్టి సిద్ధాంతాలు చేయకు ప్రియతమా!”

“అవునులే, నారాయణుని ముందు నరుని నిర్వేదంలా ఈ మాటలేమిటి ?".

“ఎవరు వాళ్ళిద్దరూ?”

“కృష్ణుడూ, అర్జునుడూ!”

“వాళ్ళ గొడవ మనకెందుకుగాని, మన వివాహమైతేనేగాని నేను ఈ ఊరునుంచి కదలదలుచుకోలేదు. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయి. ఇంక నా ఉద్యోగం విషయమూ, నేను ఎక్కడ నా వృత్తి సాగించేదీ, అవి తర్వాత నిర్ణయం చేసుకుందాం!”

వారిరువురూ అతని కారుమీద ప్రతి సాయంకాలమూ ఎక్కడికైనా వాహ్యాళికి పోయేవారు. అర్థంలేని ప్రేమ సంభాషణలలో ఆనందం పొందేవారు.

ఎల్లమందమూర్తికి జెన్నీని చూచిన కొలదీ ఆమె తన్ను వివాహం చేసుకొని, ఏమి కష్టపడుతుందో అన్న తలపోత ఎక్కువై పోయింది. అతని కౌగిలిలో ఒదిగి కూర్చుండి ఆమె అతడు పరధ్యానంగా ఉండడం చూచింది.

“ఏమిటి ప్రియతమా ఆలోచన ఎక్కువైంది?” అని ఒకనాడు సాయంకాలం యమున ఒడ్డున గూర్చుండి ఆమె ప్రశ్నించింది.

“నా ఆలోచన నువ్వు, నా కలలు నువ్వు, నా జీవితం నువ్వు! ఇంకేం ఆలోచించగలను?”

“నన్ను గూర్చి ఏమి ఆలోచిస్తున్నావు?”

“నీ అందం చూస్తాను, నా అంద వికారం చూచుకుంటాను, “సుందరీ పశువుల” కథ జ్ఞాపకం వస్తుంది. నీ తీయని మధుర కంఠమూ నా అపశ్రుతి కంఠమూ తలపోసుకుంటాను. ఈనాటి అమెరికన్ జాజ్ అల్లరి జ్ఞాపకం వస్తుంది. నువ్వు ఇంగ్లీషు సంగీతం దివ్యంగా పాడటం గమనిస్తాను. ఆనందడోలికలో ఊగిపోతాను. నా కంఠంలో సంగీతం లేదు. ఈలా ప్రతి నిముషానికీ నా పనికిరానితనమూ, నీ దివ్యత్వమూ రెండూ కళ్ళ ఎదుట కడతాయి. నీళ్ళల్లో మునిగిపోవువాని పక్కకు పడవ కొట్టుకొచ్చినట్లు నా ఎదుట ప్రత్యక్షమయ్యావు.”

“వారెవా! ఇదంతా ప్రభువువారు తమ రాణీని ప్రసన్నను చేసుకునే విధానం కాబోలు!”

“కాదు రాణీ! ఇన్ని కోట్ల హరిజనులలో, చదువుకుని తక్కిన హిందూ పెద్దలతోపాటు పైకివచ్చేవారు ఏ ఇద్దరో ముగ్గురో వుంటారు. వారిలో ఒకణ్ణిగా నేను వచ్చానంటే నా యాత్ర రహదారిలో నువ్వు ఉన్నావు గనుకనే నేను రాగలిగాను.”

“అన్నీ బడాయి మాటలు చెప్పకు ప్రియా! నువ్వు అమెరికానుంచి వచ్చిన తరువాత గద నన్ను చూచింది?”

“నువ్వు ఉన్న విషయం నా బాహ్య ఇంద్రియాలకు తర్వాతనే తెలిసినందనుకో, కాని నాకు చదవాలని బుద్ది పుట్టించిందీ ఆకివీడులో ఉన్న మిషనరీ దొరసాని. ఆమె

అడివి బాపిరాజు రచనలు - 7

64

నరుడు(సాంఘిక నవల)