పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎంతో అందమైనవారూ ఉన్నారు. తెలివైనవారున్నారు. అద్భుతమైనవారూ ఉన్నారు. కాని వారెవ్వరూ తన హృదయంలో ఇంతైనా స్పందనం కలుగజేయలేకపోయారు.

తన అన్నగారు తనకు మూర్తిని గురించి ఉత్తరాలు రాసేనాడే విచిత్రమయిన ఆనందం కలిగేది. హిందూ వేదాంతంలో చెప్పినట్లు పూర్వకర్మ అంటూ ఒకటుందేమో? తనలో హైందవ రక్తం వుంది, అది ఊరికే పోతుందా? ఆ ఏనాటి సంబంధంవల్లనో మూర్తి తనకు సర్వస్వమూ అయ్యాడు. తన జాతి పోనీ, గౌరవం పోనీ, ధనం పోనీ తనకు కావలసింది తన మూర్తి.

తన మూర్తి తన పురుషుడు కానినాడు, తన్ను అతడు కౌగలించుకోలేని దినం తనకు సంభవించిననాడు, తన్ను మహోద్రేక కామకాంక్షా పరితృప్తిలో పరవశనుచేసి అతడు కరిగించలేని క్షణం ఆసన్నమయిననాడు తాను దేహమే వీడుతుంది.

ప్రేమకు కారణాలు ఉండగలవా? ప్రేమ పరిశోధనాతీతమయిన ఒక అద్భుత సంస్థ. ఒక స్త్రీ నలుగురు పురుషుల్ని ఒకే విధంగా ప్రేమించి దేహం అర్పిస్తూ ఉండగలదట. ఒక స్త్రీ ఒక్క పురుషుని ప్రేమించడమే ఎరగకుండా జీవితం ముగించగలదట. ఒక స్త్రీ ఒక పురుషుని హిమాలయ శిఖరితంగా ప్రేమించి వానికి తన దేహం అర్పించదట. కాని ఏమీ ప్రేమించని పశువులాంటి వానికి దేహం అర్పించడానికి ఏమీ సందేహించదట. ఒక స్త్రీ తాను ప్రేమించినవానికీ మరి ఎవ్వరికీ దేహం అర్పించడం అనే భావం వచ్చి మూర్ఛలూ మొదలయిన జబ్బులు పట్టుకొని బాధపడుతుందట.

తాను మాత్రం వక్రభావ రహిత అయిన స్త్రీ; పరమ సౌందర్యం కలిగిన స్త్రీ; ఒక్కడే పురుషుని ప్రేమించగలిగిన స్త్రీ ప్రేమించిన పురుషుని తనలో లయింప చేసుకొని తాను అతనిలో లయమై దివ్యానందం పొందగలిగిన స్త్రీ.

ప్రేమకోసం ఆకాశం అంటగలదు. ప్రేమను సర్వఅనుభవాలుకన్న మహదానుభవంగా ఆనందించగల పరమ యువతి. తండ్రి అడ్డయినా ప్రపంచమే అడ్డయినా తన పురుషుణ్ణి తాను పొంది తీరుతుంది.

తనకు తన అమ్మమ్మ ధనం రాకపోతే భయమా? తాను ఈ ప్రపంచ భోగాలు కుత్తిక బంటివరకూ ఆనందించదలచుకుందా? ఇదివరదాకా తన దేహం ఇతరులు చూచి ఆనందించడాని కనుకుంది. తాను ఎవరో తెర వెనుకనున్న ఒక పురుషునితో ఒకనాడు లోకాలను ఆవరించే ప్రేమను అనుభవిస్తాను అని నమ్మింది. అలాంటి పురుషుడు ఒక పుణ్య దినాన తన ఎదుటికి వచ్చిననాడే కరిగిపోయింది. తానే పోయి అతన్ని ప్రేమిస్తున్నానని తెలుపుకుంది.

అలాంటి సందర్భంలో తన తండ్రి తన కోర్కెను సఫలం చేయకపోవడం విచిత్రమే! రైలు అన్నది: జెన్నీ తన సంఘ పారిశుధ్యం తాను రక్షించుకోవాలని తన బిడ్డలను ఏ తండ్రి అయినా అదుపాజ్ఞలలో ఉంచకూడదా?

జెన్నీ హృదయం: సంఘ పారిశుధ్యం ఏమిటి? ఎక్కడ ఉన్నది. బ్రిటిషుజాతి స్వచ్ఛమయినదా? బ్రిటిషు రక్తంలో కెల్టిక్, జర్మన్, లాటిన్, స్లావోనిక్, యూదు రక్తాలు లేవా? ఏమో! ఏ నీగ్రో రక్తం ఉన్నదో, అమెరికా జాతి స్వచ్ఛమా? జాతి సంకరత ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అందులో మా జాతి?

అడివి బాపిరాజు రచనలు - 7

60

నరుడు(సాంఘిక నవల)