పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రైలు చక్రాలు: ఓసి మూర్ఖ బాలికా! నువ్వు వివాహం చేసుకోదలచుకున్నది భారత సంఘంలో అతి తక్కువ కులంలో ఉద్భవించిన బాలుడు.

జెన్నీ గర్వం: అందుకే అతణ్ణి తప్పకుండా చేసుకుంటాను! తెల్లజాతులలో అతి నికృష్టమయిన అతి ఆఖరు సంఘంలోనుంచి నేను ఉద్భవించలేదూ?

6

జెన్నీ బెజవాడనుంచి పక్క వేసుకొని వెంట తీసుకు వచ్చిన నవలలు, మాసపత్రికలూ చదవాలని ప్రయత్నించింది. కాని లాభం లేకపోయింది. మదరాసునుంచి ప్రయాణం ఎలా చేసిందో, ఏదో నిద్ర వచ్చేది. బొమ్మలు చూస్తూ కూర్చుంది. కొందరు దద్దమ్మ మగవాళ్ళూ నిజంగా స్త్రీ సౌందర్యం దర్శించి ఆనందించేవాళ్ళూ అటూ ఇటూ తిరుగుతూ ఆమెను గాఢంగా చూశారు. కాని వాళ్ళు చూస్తున్న విషయమే ఆమె గ్రహించలేదు.

తన ప్రాణ ప్రియుని గురించి కలలుకంటూ పడుకుంది. చూపులలో అతడు ప్రత్యక్షమయ్యే చూపులతో దెసలు చూస్తూ కూర్చుంది.

ఆమె బండిలో ఎవరో భారతీయాంగనలు మువ్వురు ప్రయాణం చేస్తున్నారు. అందులో ఇద్దరు ఒక కుటుంబం వారు. ఒక అమ్మాయి భర్తతో ఢిల్లీ వెడుతున్నది. ఆ భర్త వేరే రెండవ తరగతిలో ప్రయాణం చేస్తున్నాడు. ఆడవారి అందాల ముఖమూ, రూపమూ చూస్తూ ఇటూ అటూ పచారు చేసినంత మాత్రాన మగవాళ్ళు చచ్చువాళ్ళయిపోరు కాని, ఆ చూడడంలో పురుషులు వట్టి శుంఠలుగాక, సద్బుద్ధితో చూచే రసగ్రహణ పారీణులుగానో వ్యక్తం అవుతారు అని అనుకుంది జెన్నీ హైందవ యువతి భర్త నిముషానికో మారు ఈ ఆడవారి బండికి భార్యతో ఏదో మాట్లాడడానికి వచ్చినట్టు నటిస్తూ జెన్నీని తేరిపార చూస్తూ ఉండేవాడు.

ఆ అమ్మాయికి పదునెనిమిదేండ్లు ఉంటాయి. అందమైన బాలిక. బంగారు ఛాయకలది. ముక్కున, చెవులనూ అసలు వజ్రాల ఆభరణాలు తళుక్కుమంటూ మరీ అందం తెస్తున్నాయి. ఆ అమ్మాయి తన భర్త అంటే పట్టరాని బడాయితో, ప్రేమతో వుందని ఆమె కళ్ళల్లో కాంతులే జెన్నీకి చెప్పాయి. అంత చక్కని భార్యను పెట్టుకొని ఇంకో బాలికమీదకు ఆ యువకుడు తన చూపును ఏలా ప్రసరింపగలడు? ఆ చూపుల్లో కాంక్షలు పొర్లాడుతున్నాయి.

ఆ అబ్బాయిని ఏడిపించాలని జెన్నీకి అల్లరిబుద్ది పుట్టింది. డోర్నకల్లు దగ్గిర అన్నం గిన్నెల దొంతర భార్యకు పట్టించుకు వచ్చాడా యువకుడు. ఆ సమయంలో జెన్నీ ఆ యువకుడి వీపు తట్టి “ఏమండీ! నాకు ఇంగ్లీషు భోజనం ఇంకా రాలేదు. ఎందుకో కనుకువస్తారా?” అని అడిగింది.

ఆ అబ్బాయి ఉబ్బి తబ్బిబ్బయిపోయాడు. గబుక్కున పరుగిడిపోయి ప్లాటుఫారం మీద తల్లక్రిందులా పడ్డాడు. జెన్నీ క్రిందకు దిగి అతన్ని లేవదీసింది. అతడు “మేమే” మని ఏదో కృతజ్ఞత తెలుపబోయాడు. అప్పుడు జెన్నీ అతని భార్య వింటూండగానే “ఏమయ్యా, అంత అందమయిన భార్యను తీసుకు వెడుతూ మనస్సు నిర్మలంగా ఉంచుకో

అడివి బాపిరాజు రచనలు - 7

61

నరుడు(సాంఘిక నవల)