పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తిరుగుబాటు భావాలు తాండవం చేస్తున్నాయి. ఒక్కటి మాత్రం నమ్ము. నువ్వు ఆ నిగ్గర్‌ను వివాహం చేసుకున్నావా నీ ముఖం నీ తలిదండ్రులకు చూపించనక్కరలేదు. మీ పెద్దన్నా నాతో ఏకీభవించాడు. నీకు నా సంపాదన పైస ఒక్కటీ రాదు. మీ అమ్మమ్మ తన డబ్బంతా నీకు ఇవ్వడానికి వీలు రాసిన మాట నిజం. కాని, నేనూ మీ అమ్మ మా శాయశక్తులా ఆమె వీలునామా నుండి నీ పేరు తీయించి వేస్తాము. వివాహం అయిన మరుసటి నిముషంనుండి నీ ముఖం మాకు చూపించనక్కరలేదు. ఇక వెళ్ళు.” అన్నాడు.

జెన్నీ ముఖంలో కత్తివాటు వేస్తే నెత్తురు చుక్కలేదు. అలాగే పది నిముషాలు నిలుచుంది. ఒక్కసారిగా ముఖం అంతా రక్తం పోటెత్తుకువచ్చి ఆపిల్‌పండు ఎరుపులా అయిపోయింది. డాక్టర్ అవడంచేతా, ఎప్పుడూ దేనికీ భయపడని జాతి బాలిక కాకపోవడంవల్లా వెంటనే దిట్టరి అయిపోయింది. పకపక నవ్వింది.

“డాడీ, నేను నీ కూతుర్ని, మా అమ్మ పోలికలు నాలో ఏమీ లేవు. ఆ సంగతి అందరికన్న బాగా నీకు తెలుసును. నేను మూర్తిని పెళ్ళి చేసుకోవడమే కాదు. మూర్తి మతమే నేనూ పుచ్చుకుంటున్నాను. పెళ్ళి అయేవరకూ మీరు చూస్తూ ఉండనవసరం లేదు. ఈ క్షణంనుంచి నా ముఖం మీ దృష్టిని వేసి మీ హృదయాలను కష్టపెట్టదలచుకోలేదు. నేను రాతి మనిషిని, సైతాను హృదయం కలదానిని అని అనుకోండి. అందుకు సర్వవిధాలా తగినదాన్నే. కాని మీ మీద నాకున్న ప్రేమా గౌరవం ఏనాటికీ పోవని గ్రహించండి. ఇక సెలవు.” అని ఆమె నిదానంగా వెళ్ళిపోయి తాను ఈ మధ్యనే కొనుక్కొన్న చిన్న కారెక్కి డ్రైవరును కారు నడపమన్నది.

ఢిల్లీ ఎక్స్ప్రెస్లో ఇదివరకే సెకండు క్లాసులో ఒక సీటు ఏర్పాటు చేసుకొని ఉంది. డాక్టర్ జెన్నిఫర్ ఉదయం కారులో దిగి సామాను బండిలో సర్దుకుని కూచుంది. రైలు నడక ప్రారంభించింది. చూపులేని చూపులతో కిటికీలోనుండి చూస్తూంది. ప్రపంచంలో ప్రేమ చరిత్ర సంభవించదు. సంభవిస్తే దారి పొడుగునా అన్నీ గడ్డయిన అడ్డులే అనుకొంది.

అతడు నల్లవాడని తాను ప్రేమించిందా? మనుష్యులలో ఫ్రాయిడ్ చెప్పినట్లు వ్యతిరేక హృదయ తత్వం ఉంటుంది. అందమయిన అమ్మాయి కోతివంటి వాడిని ప్రేమిస్తుంది. మన్మథుని వంటి భర్తను వదలి పుచ్చుకుంకని మిండగాణ్ణి చేసుకునే అప్సరస లుంటారట. రసజ్ఞుడు, విజ్ఞాని అయిన పురుషుని చేసుకోటం మాని, బండవాణ్ణి నీచ భావయుతుని ప్రేమించి పెళ్ళి చేసుకొంటుందట. అమెరికాలో నీగ్రోలను తెల్లవారు తమ సర్వస్వం అర్పించేటంత గాఢంగా ప్రేమిస్తారట. అలాగే తానూ అయిందేమో!

అయితే తన ప్రియుడు కారు నల్లవాడు కాడు. మోము చాలా గంభీరమైంది. ఆ మోమే తెల్లవారి మోమైతే అపోలోతో సమమయిన వాడని పోల్చేవారే! బలమైనవాడు. కష్టపడి ఉన్నతవిద్య సంపాదించుకొన్నాడు. రసజ్ఞుడు, జ్ఞానపిపాసి, సత్పురుషుడు, ఉత్తమగుణపూర్ణుడు మహారాణులు పాదదాసీలుగా రావలసిన వ్యక్తిత్వం కలవాడు. ఇవన్నీ కలసి తన్ను అతని హృదయంలోనికి వాలిపోవచేసి ఉంటాయి.

ఫ్రాయిడ్‌తత్వం నిజం కావచ్చును. కాకపోవచ్చును. కాని ఆ బాలకుడే తనకు ఏడుగడ, తన ప్రాణాధికం. తన్ను స్త్రీనిగా వాంఛించినట్టి, భార్యగా వాంఛించినట్టి వారిలో

అడివి బాపిరాజు రచనలు-7

59

నరుడు (సాంఘిక నవల)