పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తన జక్కరం గ్రామంనుంచీ, ఢిల్లీనుంచీ, సేవాగ్రామం నుంచీ జెన్నీకి రోజు విడిచి రోజు ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు.

జెన్నీ రోజు విడిచి రోజు ముత్యాలకోవవంటి దస్తూరితో ఉత్తరాలన్నీ చక్కని మంచిగంధం మంజూషలో పెట్టుకునేవాడు. మధ్యమధ్య జెన్నీకి తానూ, తనకు జెన్నీ తంతులు ఇచ్చుకొనేవారు.

141, పూనమల్లి రోడ్డు, కీల్పాకు,

మదరాసు,

6 మార్చి, 1939

“ప్రియతమా!

మా నాన్నకూ, అమ్మకూ నీ విషయం, మన ప్రేమ విషయం చెప్పాను. పెండ్లికి అనుమతి ఇవ్వవలసిందని కోరాను.

మా తండ్రి ఆలోచించుకోనిమ్మన్నాడు. మా అమ్మ మూతి ముడుచుకుంది.

మర్నాడు మా తండ్రి పిలిచి, “జెన్నీ ఈ వివాహం నాకేమీ ఇష్టంలేదు, మీ తల్లికీ అంతే! ఆమెతో నువ్వు మాట్లాడు.” అన్నాడు.

“నేను, ఎందుకు ఇష్టం లేదు డాడీ నీకు'?” అని ప్రశ్నించాను.

ఒక కారణం మన సంఘమూ పెరయా సంఘమూ కలియదు. నీ భావికి మంచిది కాదు.

రెండు, ఆ అబ్బాయి ఎంత చదువుకున్నా అతడు నీగ్రోజాతివాడు! మనం తెల్లవాళ్ళం. ఈ రెండు జాతులూ కలియడం నేను చూస్తూ చూస్తూ ఒప్పుకోదలచుకోలేదు.

మూడు, అసలు ఈ సంథానం నా మనస్సుకు ఎంత ప్రయత్నించినా ఎక్కటంలేదు. ఇది కారణం లేని కారణం.

నువ్వు ఈడుకు వచ్చిన పిల్లవు. ఇంకా మైనరువు కావు. ఉద్యోగంలో చేరావు. నీ భవిష్యత్తు నువ్వే నిర్ణయించుకొనే దశలోకి వచ్చావు. నీ కుటుంబం మంచీ, నా సంఘం స్థితీ ఆలోచనా సలహానే నువ్వు పాటించేటట్లయితే, మూర్తిని భర్తగా భావించుకోవడం మానెయ్యి.” ఇవి మా తండ్రి మాటలు.

ఈ రెండో పరాభవంతో నేను భూమిలోకి కుంగిపోయాను. ప్రాణప్రియా! నిజమయిన నిర్మలమయిన ప్రేమ వచ్చినచోట్ల ఈలాంటి అడ్డాలు ఉద్భవిస్తూ ఉంటాయి కాబోలు. నేను మాట్లాడకుండా వచ్చేశాను.

ప్రియతమా! నువ్వు దూరంగా వున్నావు. నిన్ను వదిలి వున్న ప్రతి నిముషమూ యుగాలై పోతున్నది. వైద్యాలయానికి వెడుతున్నాను. ఆ పనిలో మునిగిపోతాను. కాస్త కాళీ వచ్చిందంటే నువ్వు ప్రత్యక్షం అవుతావు. ఎన్ని అడ్డాలు వచ్చినా నువ్వే నాకు; నేనే నీకు ఈ అనుబంధం విచిత్రమే. నేను డాక్టర్ని, ప్రేమంటే ఒకటి ఉందని నాకు నమ్మకం లేకుండా ఉండేది. అలాంటి ప్రేమ మానవజన్మకు అత్యంత ఉత్తమత్వం ఆపాదించే మహత్తర విషయం.

అడివి బాపిరాజు రచనలు - 7

52

నరుడు(సాంఘిక నవల)