పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉందనీ హరిజన సమస్యతో యూరేషియన్ సమస్య కూడా తీసుకుని యూరేషియన్ల స్థితి ఉత్తమమయ్యే మార్గాలు ఉపదేశించి కాంగ్రెసువారి నిర్మాణ కార్యక్రమంలో భాగం చేయించాలనిన్నీ కోరుతూ జెయిలు నుండి విడుదలైన మహాత్మునికి పెద్ద లేఖ పంపించింది.

మహాత్ముడు అప్పుడే హరిజన సమస్య విషయంలో దేశ పర్యటన ప్రారంభించాడు.

“అమ్మాయీ” నీ ఆవేదన నాకు అర్థమయింది. నీ యూరేషియన్ సంఘము అతి నీచస్థితిలోనే ఉంది. కాని హరిజన సమస్య వేరు. మీ సమస్య వేరు. మీ సంఘం కావాలని అతి నీచస్థితిలోనికి ఉరికింది. మీ నీచస్థితికి మీరే కారకులు. భారతీయ క్రైస్తవులు తమ స్థితిని తామే బాగుచేసుకుంటున్నారు. అలాగే యూరేషియను సంఘమూ తన స్థితిని తానే బాగుచేసుకోవాలి! పార్శీ సంఘమూ చిన్నదే! ఆ సంఘము ఈనాడూ, వెనకా ఎప్పుడూ ఉత్తమస్థితే ఆక్రమించుకొంటున్నది - హరిజన సంఘం అలాంటిది కాదు. ఆ సంఘం ఈనాడు అనుభవించే కడగండ్లు, ఆవేదనలు, అవమానాలు మొదలయిన వానికన్నింటికీ హిందూ సంఘంలోని ఉత్తమ కులాలవారు బాధ్యులు, అందుకని ఆ సమస్యా పరిష్కారం నా అహింసా వ్రతంలో భాగమయింది. నేనూ ఆ ఉత్తమ కులాలకు చెందిన హిందూ మతస్థుడను. కాబట్టి ఇన్ని యుగాలనుండి ఆ ఉత్తమ కులాలవారు చేసిన ఘోర పాపాలకు వారితోపాటూ నేనూ ప్రాయశ్చిత్తం సలుపుకుంటున్నాను. ఆ సంఘాన్ని తక్కిన హిందువులతోపాటు సమం చేయాలని నా దీక్ష!

“నువ్వన్నట్లు ఆ హరిజన స్త్రీలలో ఎంతోమంది మీకు తల్లులే. పాపం ఆ కల్మషరహిత చరిత్రలు తమ దుర్భర స్థితివల్ల మీ సంఘానికి తల్లులయ్యేటట్లు పాపాలు సలిపినారు. అందుకని ఉత్తమ కులాల హైందవులు మీ స్థితికి కొంత కొంత బాధ్యత వహించవలసినదే! మీ పూర్వీకులూ, మీ పూర్వీకుల తండ్రులైన ఆంగ్లేయులూ మొదలయిన పాశ్చాత్యుల మతమే మీ పూర్వీకులు తీసుకున్నారు. ఆ పాశ్చాత్యులు మీకు ఏ అభిమానం చేతనో అనేక చిల్లర సహాయాలు చేస్తున్నారు. ఆ సహాయాలు మీరు పూర్తిగా గ్రహించి.

1. సంపూర్ణంగా చదువుకోవడంవల్లనూ,

2. ఎక్కువ నైతిక ప్రవర్తన అలవరచుకోవడంవల్లనూ,

3. మీలో చాలామంది కాంగ్రెసులో చేరి, అహింసావాదులై దేశసేవ చేయడానికి సిద్ధం కావాలి. “మేము భారతీయులం కాము.” అని అనుకోవడం మానివేయాలి. మీ వాళ్ళు బ్రిటిషు దొరలు భోంచేసే బల్లదగ్గిర పడిన ఆహారపు నలుసులు తినే కుక్కలము - అని అనుకోవడం మానివెయ్యాలి..

ఈ కారణాలవల్లనూ మీ సంఘం ఉన్నతస్థితి పొంది తక్కిన భారతీయ సంఘాలతోపాటు అవుతుంది.”

మహాత్ముడు రాసిన ఉత్తరం ఒక అందమైన పెట్టెకొని అందులో పవిత్రతా భావంతో దాచుకొంది.

కాబట్టి తన యూరేషియను సంఘంలో మదరాసులో 1934 క్రిష్టమస్‌కు జరిగే ఉత్సవాలలో ఆమె పాల్గొనదలచుకోక ఎంతమంది చుట్టాలూ, స్నేహితులు, నాట్యాలకూ, విందులకూ పిలిచినా, ఆ పిలుపు నిరాకరించింది జెన్నిఫర్.

అడివి బాపిరాజు రచనలు - 7

29

నరుడు(సాంఘిక నవల)