పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ ఉత్తరం చదువుకుంది. తన చిన్నన్న ప్రతి ఉత్తరంలోనూ ఆ బాలకుణ్ణి గురించి వ్రాస్తున్నాడు. ఏమి రకం యువకుడో అతను? అని మాత్రం ప్రశ్నించుకుంటూ ఉంటుంది జెన్నిఫర్.

2

1934 నుంచి 1937 డిశంబరు వరకు అన్నగారు లయొనెల్ ఇంగ్లండు నుంచి ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. తనకూ తన ప్రియమూర్తి ఎలిజబెత్‌కు అంతకన్న, అంతకన్న ఎంత పరమాద్భుతమయిన ప్రేమో వృద్ధి అయిందట. తన చదువు వొక మోస్తరట, తన ప్రాణస్నేహితుడు మూర్తి చదువు అఖండ దీప్తితో ప్రజ్వలిస్తోందట!

పరీక్షలు కాగానే అన్నగారు రాసిన ఉత్తరంలో మూర్తి ఆ ఏడు జయమందిన వారందరిలో మొట్టమొదటి వాడుగా వచ్చాడనీ, తాను ఒక్క మొదటి తరగతిలో మాత్రం రాగలిగానని, తనకూ మూర్తికి తాతావారు తమ నగర్ కర్మాగారానికి రమ్మన్నారని, అందుకు మూర్తి ఒప్పుకోలేదనీ, తాను ఒప్పుకున్నాననీ ఉత్తరం రాశాడు.

ఆ ఉత్తరంలో మూర్తి అమెరికా వెడుతున్నాడనీ అక్కడ టెన్నెసీనది ఆనకట్టలు, అందువల్ల విద్యుచ్ఛక్తి ఉద్భవించే విషయాలను గూర్చి నేర్చుకోడానికి వెడుతున్నాడనీ వ్రాశాడు. తాను ఇంగ్లండూ, జర్మనీ, రష్యాలలో విద్యుచ్ఛక్తి విధానాలన్నీ పరీక్షించి నేర్చుకువస్తాడట. ముఖ్యంగా రష్యాలో “నీరునది” ఆనకట్ట, దానివల్ల విద్యుచ్ఛక్తి ఉద్భవించే విధానమూ ఒక సంవత్సరంపాటు నేర్చుకువస్తాడట. అందుకయ్యే ఖర్చు అంతా “తాతా” కంపెనీవారే ఇస్తున్నారు అనీ రాశాడు.

తాను ఎలిజబెత్‌ను వివాహమై, ఆమెతో కూడా రష్యా మొదలయిన దేశాలన్నీ చూస్తాడట.

అన్నగారు రాసిన ఉత్తరాలలో వర్ణింపబడిన ఆ “మూర్తి” ఎవరు చెప్మా అన్న ప్రశ్న జెన్నిఫర్ హృదయంలో ఉద్భవించింది. తన తల్లితో మూర్తిని గూర్చి చర్చించేది. తనకు అన్నగారు రెండు డజన్లు ఫోటోలు పంపించాడు. అందులో మూడు మూర్తీ తాను తీయించుకున్నవి; నాలుగు తన్ను ఒక్కణే మూర్తి వివిధ స్థలాలలో తీసినవి, రెండు అన్నగారు ప్రత్యేకంగా ఒక మంచి కంపెనీలో తీయించుకున్నవి. రెండు మూర్తి ఫోటోలు తాను తీసినవి. తానూ తన కాలేజీ విద్యార్థులూ ఆచార్యులూ అందరూ కలిసి తీయించుకున్నవి రెండు. అన్నగారు అతని ప్రియురాలు కలసి తీయించుకున్నవి మూడు. అతని ప్రియురాలు ఒకటి. ఆమె కుటుంబము బొమ్మ ఒకటి. తక్కినవి ఇతరాలు.

మూర్తి ఫోటో మాత్రం జెన్నిఫర్‌ను కొంచెం ఆకర్షించింది. ఆ అబ్బాయి చరిత్ర విచిత్రమయిందన్న ఆశ్చర్యము, ఈతని సంఘం అంత దుర్భరమయిన స్థితిలో ఉన్నదన్న కరుణ, అంత అధోగతి స్థితిలోనుండి పట్టుదలతో, అద్భుతమైన శక్తితో ఇలా పైకి వస్తున్నాడన్న గొరవమూ ఆమెకు కలిగాయి.

ఆ ఫోటోలన్నిటిబట్టీ యీ అబ్బాయి ఎలా ఉంటాడు అని ఊహించుకునేది. కారునలుపు కాకపోయినా, నలుపే! ముఖం మాత్రం విశాల ఫాలంతో, గుండ్రనితనంలోకి


అడివి బాపిరాజు రచనలు - 7

25

నరుడు(సాంఘిక నవల)