పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వచ్చే కోలతనంతో, చదరపు గడ్డంతో, స్పష్టమయిన రేఖలతో, శక్తిని సూచించే వంపులతో వీరుని ముఖాన్ని ప్రత్యక్షం చేస్తున్నది.

వైద్య విద్యార్థులకు స్త్రీ పురుష సంబంధాల విషయంలో లేనిపోని పిచ్చిపిచ్చి భావాలు లేవు. రతి అనేది భౌతికమయిన అనుభవం. అందులో ముఖ్యంగా నరముల స్పందన ఎక్కువ ఉంటుంది. ఆ నరముల ద్వారా మెదడుకు ఆనందం కలుగుతుంది. భౌతికమయిన వాంఛలకు నరాల స్పందనవల్ల ఆనందం అనుభవం మెదడుకు కలుగుతుంది.

కోపం కలుగడానికి ఇంకొక మనుష్యుడు ఎదురు ఉండాలి. అలాగే స్త్రీ పురుష సంబంధమయిన వాంఛకు స్త్రీ పురుషులొకరి కొకరు తారసిల్లాలి.

జెన్నిఫర్ కొంచెం పొట్టి, నాలుగడుగుల పది అంగుళాలుంటుంది. ఐనా పొంకం కలిగిన అవయవాలతో బంగారు తీగలా వుంటుంది.

ఆ అమ్మాయి సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు చూడాలి ఆమె దేహసౌందర్యం. ఆమె అంగాల పొంకం తీగెలుసాగిన పచ్చ సంపెంగ నికుంజము, పిడికిటకు దొరికె ఆమె నడుము, కటిరేఖలలో నాతిగా విస్తరించి స్నిగ్ధమై స్విన్నమై దంతం చెక్కిన జఘన వక్రతలలో పొంగి నదిలా పాదాలకు ప్రవహించింది. ఆమె వక్షోజద్వయ కలశాలు స్వచ్చరజిత స్వప్నాలు. ఆమె మోము కొద్దిగా కోలనై పైకి వట్రువతిరిగిన తిలపుష్ప నాసికతో, చిరుగులాబీ మొగ్గ జంట వదనంతో, మాలతీ పూలగుత్తి చిబుకంతో, చిరునవ్వుతో పాల్కడలి పొంగులై సుడులుపడి, ఉషారుణ వర్ణచ్ఛవుల ప్రసరించే గండఫలకాలలో శిల్పుల కాశయ ప్రత్యక్షమే ఆ బాలిక.

ఇసుకలో నడుస్తూ సముద్ర వీచికలలోకి చొచ్చుకు వెళ్ళుతూన్న జెన్నిఫర్ కలశాంబోధి తరంగోద్భవ ఘృతాచీ బాల! ఆమె నడక అరభీరాగ కల్పన. ఆమె ఒయారము శృంగార రసావిర్భావము. ఆమె మూర్తి ధ్వన్యాలంకార యుక్త పరమ సౌందర్య కావ్యము.

ఆ బాలికను ఆశించని యువకుడు వైద్య కళాశాలలో మదరాసు నగర పథాలలో ఎవ్వరూ లేరు. తేనె, ద్రాక్ష, సారాయీ వకుళపరీమళమూ రంగరించిన సౌందర్యము ఆమె కంఠస్వరం. భారతీయ స్త్రీ కంఠంలోని కాకలీతనమూ, ఆంగ్ల స్త్రీ కంఠంలోని గంభీరతా రెండూ యమునా గంగా సంగమమయ్యాయి.

ఆ జవ్వని అజంతా గుహలలో తథాగతుని ఎదుట లాస్యమాడు మారదేవ తనయ! ఆయోష, ఎల్లోరా గుహలలో ఇంద్రసభా యుక్త శచీదేవి!

3

జెన్నిఫర్‌కు తన అన్నకు అంత సన్నిహితుడైన మూర్తిని చూడాలన్న వాంఛ కలిగింది. అన్న ఒక ఉత్తరంలో మూర్తికి జెన్నిఫర్ ఛాయాచిత్రం ఒకటి. తన కుటుంబం అంతా తీయించుకున్న ఛాయాచిత్రం ఒకటీ ఇచ్చానని వ్రాసినాడు. జెన్నిఫర్ తన అన్న పిచ్చివాడనుకొంది.

జెన్నీ! మూర్తి నీ ఛాయాచిత్రం చూస్తూ నేను పక్కన ఉన్నానన్న విషయం మరిచిపోయాడు. “ఏమిరా మా చెల్లి బొమ్మలో ఏమి విచిత్రత ఉంది?” అని ప్రశ్నించాను. మూర్తి తెల్లబోయి చిరునవ్వు నవ్వి,

అడివి బాపిరాజు రచనలు - 7

26

నరుడు(సాంఘిక నవల)