పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్కడనుంచి విజ్జీకి, ఆమె కుటుంబానికీ విడాకులు సంభవించినంతయింది. చివరకు పార్సెన్ (ఒక మతోద్యోగి) అయిన ఆ బాలిక తండ్రే మా వివాహానికి ఒప్పుకున్నాడు.

చెల్లీ! నేనిప్పుడు ఏడవ ఆనంద స్వర్గంలో ఉన్నాను. తండ్రిగారికి, అమ్మగారికి కూడా ఉత్తరాలు రాశాను.

కాబోయే నా మామగారిని ఒప్పించింది, మూర్తి! మూర్తి అంటే ఎవరనుకున్నావు? అంత తక్కువజాతి హిందువుడైనా, అంత పెద్దజాతి యువకుడు ఇంకోడు లేడు. అతడు అమృతం. అతడు పనిలో ఒక పెద్ద డైనమో! ఎప్పుడూ ఆలోచనే! ప్రతి విషయాన్ని గురించీ తర్కించుకుంటాడు. ఆలోచిస్తాడు. అర్ధమై, అవగాహనమై పూర్తిగా అతని మెదడు సొత్తు అయినవరకూ ఆ విషయాన్ని గురించి తెలుసుకోవడం మానడు. ప్రతిజ్ఞచేత ప్రతిభ సంపాదించుకునే మహాతపస్వి. ఈ దేశంలో ఉన్న విద్యుచ్ఛక్తి కర్మాగారాలకు వేడ్తాడు. నన్ను తనతో లాక్కుపోతాడు. అతడు చదువుతూ నాకు వినిపిస్తాడు, నన్ను చదివిస్తాడు, నా చేత తనతోపాటు లెక్కలన్నీ చేయిస్తాడు.

ఇంక మూర్తి గుణగణాల్ని గురించి నేను వర్ణించలేను. ఎవరో షేక్సుపియరో, బెర్నార్డుషా ఓ రావాలి! అంత నీచస్థితిలో ఉన్న సంఘంలోనుంచి అలాంటి మహోత్తముడు ఎలా వచ్చాడు!

నీ కీ తపస్సుకు కారణం ఏమిటంటే, “మహాత్మాగాంధీ ముఖ్యంగా!” అంటాడు. ‘ఈనాటి కాలం రెండు" అంటాడు.

మూర్తి మా కాబోయే మామగారితో మహాత్మునిలా మాట్లాడాడు. అతని మనస్సు తిప్పినాడు. మూర్తి వేదాంతమే వేరు; గాంధీని గురించి మా యిద్దరకూ కొన్ని నెలలు వాదనలు జరిగాయి.

చేతి పరిశ్రమలు మానవకృషి అట! అవి దివ్యోన్ముఖాలట! యంత్ర పరిశ్రమ రాక్షసమట (సాటానెస్క్యు)! సైతానును మనం లోబరచుకుంటే రాక్షసత్వాన్ని బానిసగా చేసుకున్నట్లు మాత్రమట! సైతానును భగవతోన్ముఖం చేస్తే, సైతాను అప్పుడు తనలోని దేవత్వం తిరిగి పొంది మనలను కూడా దేవతా మానవులుగా మారుస్తాడట!

రష్యా బోల్షివిజము రాక్షసత్వాన్ని బానిసగా చేసుకున్నదట. ఇంగ్లండు అమెరికాలు రాక్షసత్వానికే బానిసలట. రష్యాబోల్షివిజంతో గాంధీతత్వం రంగరిస్తే ప్రపంచ సమస్యలు సిమెంటుదారులు కావుగదా, వజ్రాలదారులవుతాయట.

హిందూ సంఘంలో తామెంత నీచస్థితిలో ఉన్నారో, మనమూ, తెల్లజాతిలో అంతకన్న నీచస్థితిలో ఉన్నామట. ఆ స్థితిని తీసివేసుకునే శక్తి మనలోనే ఉందంటాడు. దానికి ముఖ్య మార్గం మనం సంపూర్ణంగా భారతీయుల మనుకోవాలట. భారతీయులు తమ అభ్యుదయం కోసం, తమ స్వాతంత్ర్యంకోసం ఏఏ మహాసంస్థలు ఉద్భవింప చేసికొని మహా పోరాటం సాగిస్తున్నారో, ఆయా సంస్థలలో మనం కూడా చేరాలట. ఇంతవరకు మనం అలా చేయటం లేదట! చెల్లీ నువ్వీ స్నేహితునితో కలుసుకు మాట్లాడి తీరాలి.

ప్రేమతో

లయొనెల్



అడివి బాపిరాజు రచనలు - 7

24

నరుడు(సాంఘిక నవల)