పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లేకపోవటమే కారణం. తన పద్మ చదువుకొన్నది. చదువుకుంటుంది. తాను చదువు కొంటున్నాడు. ఈ పరీక్షలు చదువులో ముందుకు ప్రయాణం చేయించగల మజిలీలవంటివి. తన పద్మ బి.ఏ. ప్యాసవుతుంది. తానూ తన పద్మా దేశాలు తిరుగుతారు - తన కంపెనీ బాగా ఏర్పాటుచేసి, తానూ తన పద్మా అమెరికాకో, ఇంగ్లాండుకోపోయి అక్కడ చేపల విషయమూ అందుకు సంబంధించిన సముద్రజ్ఞానమూ, సముద్రయాన ప్రావీణ్యమూ అలవరచుకుని రావాలి. అప్పుడే తన దేశానికి తానేదైనా సేవ చేయగలడు. తనకు ఉద్యోగాలు అవసరం లేదు. తన కంపెనీ మంచి లాభాలు తెస్తున్నది. తాను ఇదివరకు కంపెనీల వారివలె పల్లెవారి దగ్గిర అతి చవకగా కొని, అతి లాభంగా అమ్మటంలేదు. తానన్ని కంపెనీ కన్న ఎక్కువ ఖరీదులకు కొంటున్నాడు. లాభసాటికి పరదేశాలకు ఎగుమతి చేస్తున్నాడు. చీనాకు, జపానుకు, బర్మాకు, మలయాకు, సింహళానికి, జావాకు తన సరకు రవాణా అవుతోంది. తాను ప్రభుత్వానికి లెక్కలన్నీ సరిగా చూపించి, ఇవ్వవలసిన పన్ను సకాలంలో ఇస్తున్నాడు. తనకు రాజకీయాలు అనవసరం.

ఏమిటీ తనకీ ఆలోచనలు? ఈలాంటి ఆలోచనలే తనకీ మధ్య, వీటి అన్నింటికీ కారణం పద్దాలు. తనకు చిన్నతనంనుండీ ఓ దేవకన్యలా దర్శనం ఇచ్చేది. ఆమెకు తగిన భర్త కావాలని తాను యుద్ధానికి పోయినాడు. యుద్ధం వారికి అన్నీ సప్లయిచేసే కంపెనీలవారి విషయం అంతా చూసి, తాను యుద్ధం నుంచి రాగానే రొయ్యపప్పు, ఎండుచేపల ఎగుమతి కంపెనీ పెట్టినది, పద్దాలును లక్ష్మీదేవిని చేయడానికే. తన పద్దాలు సౌందర్యదేవత. తన పద్దాలు సంగీత సరస్వతి. తన పద్దాలు తన జీవితానికి ఆరాధ్యదేవి.

ఏ తిక్క పుట్టిందో తనకు మదరాసు నగరంలో తన పద్దాలు వట్టి పల్లెపిల్ల అనిపించింది. తనతోపాటు తన పద్దాలు ముందుకు సాగి రావడం లేదనిపించింది. ఈ సినీమా తారలు, ఈ బీచి సుందరులు తన్నేదో మైకంలో ముంచారు. కాస్తయితే తన పద్దాలు తనకు దూరమైపోయి ఉండును. ఆమె గీతాదేవి. తాను వట్టి మొరకుడు. ఆమె సంగీతం పాడుతూ ఆ సభలలో వేదికపైన కూర్చుని ఉంటే, తనకు ఆకాశంనుంచి దిగి వచ్చిన దేవతామూర్తిలా కనబడింది. తాను బజారుల వెంట వెడుతూ ఉంటే, ఆమె రికార్డులు విన్నప్పుడు, రేడియోలో ఆమె పాడినప్పుడు దివ్యమైన ఆ గాంధర్వం విన్నప్పుడు, తనకప్పుడామె వెలిగిపోయే శరీరంతో ఎదుట నిలుచున్నట్లే అయ్యేది.

పద్దులూ! సౌందర్యాలరాణీ! దివ్య గాంధర్వాలు లోకాలను ఉప్పెనలుగా ముంచే గీతాదేవీ! మూర్ఖుడైన తాను తన్నే మర్చిపోయే స్థితికి వచ్చాడా?

తానట సినీమాకంపెనీ పెడతాడట. సుశీల మాత్రం సీతాకోకచిలకల్లే తనదే. నర భరత పక్షులను కొన సాహసించాడట! ఎంత దౌర్భాగ్యము. ఏనాటికైనా పతితుడు కాబోయే పురుషునికి స్త్రీయే చేయి అందిస్తుంది. స్త్రీ వట్టి బిడ్డలుకనే పశువు అనుకొన్న ప్రతి పురుషుడూ కూవం నదివంటి పరమ దౌర్భాగ్య కూపంలో కూలిపోతాడు.

విమానం హైదరాబాదులో ఆగి మళ్ళీ బయలుదేరింది. నాగపురంలో ఆగింది. అతనికి ప్రయాణంలో పలకరించేవారే లేరు. ఆలోచనలే అతని తోటి యాత్రీకులయ్యాయి.

విమానం మహావేగంతో రెక్కలు చాచి వింధ్యపర్వతాలు దాటింది.

అడివి బాపిరాజు రచనలు - 7

172

జాజిమల్లి(సాంఘిక నవల)