పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3

పద్మావతి న్యూఢిల్లీలో దిగగానే ఎదుటకు వచ్చి బుచ్చి వెంకట్రావు నిలుచుని వున్నాడు. పద్మావతికి తక్కిన సర్వమూ మాయమైనవి. ఠీవిగా రూపమెత్తిన దివ్యత్వంలా ఆమెకు బుచ్చి వెంకట్రావు కనిపించినాడు. రైలులో ప్రయాణం చేసిన తోటి మహిళలు, ఒక దేవికి నమస్కారం చేసినట్లు పద్మావతికి నమస్కరించి, ఆమెను కౌగలించుకొని, కరస్పర్శ చేసి ఢిల్లీనుండి వెళ్ళబోయే ముందు తమ తమ ఇండ్లకు ఆమెను రమ్మని ఆహ్వానించారు.

పద్మావతి సర్వమూ మరచిపోయింది. వారేమంటున్నారో ఆమెకు వినబడలేదు. ఏదో చిరునవ్వు! ఏదో నిర్వచింపరాని ఆనందం.

ఇంతట్లో ఆమెకు చటుక్కున జ్ఞప్తికి వచ్చి, ఆ స్నేహితురాండ్రకు బుచ్చి వెంకట్రావును కళ్ళతో చూపి, సిగ్గుతో “వారే! వారే!! నన్ను కలుసుకోడానికి విమానంమీద ఢిల్లీ వచ్చారు” అని చెప్పింది. వారాతనికి నమస్కరించారు. అతడూ సిగ్గుపడుతూ వారికి ప్రతి నమస్కరించాడు. ఎవరి మగవారు వారి కడకు వచ్చారు. మగవారిని ఒకరికొకరు ఆడవారే పరిచయం చేశారు. ఒకరికొకరు నమస్కరించుకొన్నారు.

అందరూ ఒకరి దగ్గిర ఒకరు సెలవు పుచ్చుకొని మళ్ళీ కలుసుకుందామనుకొని ఎవరి దారిన వారు వెళ్ళిపోయినారు.

ఆమె ఏర్పాటు చేసుకొన్న వారింటికిగాక బుచ్చి వెంకట్రావు తానేర్పాటు చేసిన హోటలుకు పోదామన్నాడు.

నరసింహమూర్తి మేష్టారుకు తన బిడ్డలిద్దరూ ఈ విధముగా కలుసుకోవడం వైకుంఠం అబ్బినట్లయినది. సర్వపవిత్ర క్షేత్రాలు ఒక్కసారిగా దర్శించినట్లు అతని ఆత్మ పొంగిపోయినది.

నరసింహమూర్తి మేష్టారి జీవితం సంగీతమయం. విశ్వమే గాంధర్వంలోనుంచి ఉద్భవించిందని అతని నమ్మకం. అతడు కలలు కన్న పరమ సంగీతమూర్తి తన శిష్యురాలైన ఈ కైవర్తక బాలికయై ఉద్భవించింది. అతడు ధనంకోసం ఆదినుంచి ఈ కుటుంబాన్ని నమ్ముకొని మదరాసు రాలేదు. పద్మావతి సంసారమోహంలోపడి ఎక్కడ సంగీతం మరచిపోతుందో అన్న భయంతో వారు అడగగానే వారి వెంటబడి వచ్చాడు. తానింత వండుకొన్నాడు. వారికింత పెట్టాడు. వారు తనకోసం మాంసాహారమే మానివేశారు. బుచ్చి వెంకట్రావుకు మాంస భక్ష్యాలపై మనస్సుపోతే మిలిటరీ హోటలులో మంచి దానికి పోయి తిని వచ్చాడు. స్త్రీలకున్న పట్టుదల పురుషుల కుండదు. పద్మావతి మాంసం మానవేసిందంటే తన జన్మలో మాంసాహారమే ఎరగనిదిగా అయిపోయింది. అందుకనే నరసింహమూర్తి మేష్టారు పద్మావతిని కన్నకూతురుకన్న ఎక్కువగా ప్రేమించుకొన్నాడు.

వారు ముగ్గురూ టాక్సీమీద, బుచ్చి వెంకట్రావు ఏర్పాటు చేసిన ఉత్తమమైన ఒక హోటలుకు వెళ్ళారు.

రైలు స్టేషన్ ప్లాట్ ఫారంమీదగాని, కారులోగాని, హోటలులో దిగి తమ భాగంలోనికి పోయినప్పుడుగాని పద్మావతి భర్తతో ఏమీ మాట్లాడలేకపోయింది. బుచ్చి వెంకట్రావూ భార్యతో ఏమీ మాటలాడలేకపోయినాడు.

అడివి బాపిరాజు రచనలు - 7

173

జాజిమల్లి(సాంఘిక నవల)