పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బావను విడిచి పారిపోయింది! ఎట్లు విడిచి ఉండగలిగింది తాను? ప్రేమకోసం సర్వమూ ఆహుతిస్తారన్నమాట వట్టిది. గాఢంగా కోరిన ఏ సంఘటన కోసమైనా మనుష్యుడు తన జీవితం కొంత ఆహుతిస్తాడు, ధనం, పదవి కోరినవాడు తన గౌరవం, తనలోని ఉత్తమ మానవత్వం నాశనం చేసుకొంటూనే ఉన్నాడు.

ఇప్పుడు పద్మావతిలో బాలికాత్వము జారిపోయింది. ఆమె మనస్సులోని మంచులు దెసలకు ప్రవహించి మాయమైనాయి. చిన్ననాటినుండి తన నాయకుడు బుచ్చి వెంకులు బావే! అతడు తనకై, అతనికై తాను మెట్లెక్కుతూ పైకి నడిచివచ్చారు. తాము చిన్ననాడు ఆడుకొన్న సముద్రానికి మేరలు చిన్నవి. ఈనాడవి విస్తరించి కడపలను దాటి పోయాయి.

ప్రతి జీవితమూ ఇంకో జీవితంతో చేయి అంది పుచ్చుకొని మెట్టెక్కిపోవలసిందే, అదే మానవుని నిత్యలీల! అదే భగవంతుని నిత్యఖేల? అనుకుంది ఆమె చిన్న బిడ్డలా, ఆమె హృదయం శాంతి పొందింది.

రైలు వేగంగా సాగిపోతూ ఉంది.

2

బుచ్చి వెంకట్రావు ఆకాశపథంలో మహావేగంగా ఉత్తరానికి ఎగిరిపోతున్నాడు. నరసింహమూర్తి మేష్టారి టెలిగ్రాం అందిన వెంటనే కారుమీద విమాన కార్యాలయానికి పోయి, వెంకట్రావు ఢిల్లీకి టిక్కెట్టు కొనుక్కున్నాడు. ఆ మర్నాడు ఉదయమే విమానం అందుకొని ప్రయాణం సాగించాడు.

క్రింద ఎన్ని పట్టణాలు, నదులు, కొండలు వెనక్కు పరుగిడుతున్నాయో! పొలాలూ అడవులు జిల్లాలు, రాష్ట్రాలు, వెనకనే ఉండిపోయాయి. అలాగే తన బ్రతుకులో ఎన్నో కాంక్షలు, బాధలు, ఆనందాలు, సంఘటనలు వెనక్కువెళ్ళినా, అవన్నీ ప్రయాణమార్గంలో ఉండనే ఉన్నాయి. అదేరీతి తన జీవితంలోని సంఘటనలూ అలాగే ఆ వెనక సంవత్సరాలలో ఉండిపోయాయో ఏమో? మనుష్యుడు వెనక్కు వెళ్ళడం నేర్చుకుంటే, ఆ జీవితయానంలో మళ్ళీ ఆ సంఘటనలన్నీ సంభవిస్తాయా? తన తల్లిదండ్రులు వెనకటి ప్రపంచాన్ని ప్రత్యక్షంచేస్తూనే ఉన్నారు కదా!

తాను తన గ్రామంలో తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు చక్కని పెంకుటిళ్ళు కట్టించి ఇచ్చాడు. మామగారికీ, చాలామంది చుట్టాలకూ తన రొయ్యపప్పూ, ఎండుచేపలూ ఎగుమతి కంపెనీలో వాటాలు ఇచ్చాడు. తన కంపెనీలో వాటాలుగల వారందరి దగ్గర కొద్దోగొప్పో సొమ్ము నిల్వ వుంది. ఆ వాటాదార్లందరూ చిన్న చిన్న పెంకుటిళ్ళు కట్టుకున్నారు. కాని వారందరూ ఇంకా పల్లీయులే. ఇంకా పుట్టగోచీలు పెట్టుకుని తన చుట్టాలు పెద్దలూ చిన్నలూ అందరూ సముద్రం వేటకు వెడుతూనే యున్నారు. అలా పల్లీయులు సముద్రం వేటకు వెళ్ళకపోతే తన కంపెనీ దివాలా తీసిందన్న మాటే!

తన పల్లెవారిలోనుండి ఇంగ్లండులోవలె ఉత్తములైన నావికులు తయారుకావాలి. చదువులు లేకపోవడంచేతనే కదా తన వాళ్ళని ప్రభుత్వం యుద్ధనౌకా నావికులుగా చేర్చుకొనకపోవడం. కులమత వైషమ్యపూరితమైన ఈ నికృష్ట జీవితానికంతకూ చదువు

అడివి బాపిరాజు రచనలు - 7

171

జాజిమల్లి(సాంఘిక నవల)