పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(ద్వాదశ గుచ్చము)

రైలు వేగంగా సాగిపోతోంది. పద్మావతి హృదయంలో ప్రత్యూషం ఉదయించేటట్లే లేదు. తన భావ ఢిల్లీ రాకపోతే? తన బావకు తానేమీ పనికిరాకపోతే? పురుషునకు స్త్రీగాని, స్త్రీకి పురుషుడుగాని ఒక్క స్త్రీ పురుష సంబంధార్థానికేనా ఉద్భవించింది! అయితే పండువలె, ఋషి దంపతులవలె జీవించే వృద్దులైన భార్యాభర్తల గతి?

బ్రహ్మచారిణులై, విధవాత్వాన యోగినులై జీవిస్తూ, జాతి సేవచేసే ఉత్తమ స్త్రీల జీవితాలు అర్థములేనివేనా? మానవ జీవితం తీగెలల్లుకుపోయిన నికుంజమువంటిది. బహుళ లతాపూర్ణ నికుంజములో ఏ తీగను విడిగా పరిశీలించగలమూ అని పద్మావతి భావించుకొన్నది.

రైలులో తనతోటి ప్రయాణీకులైన ఈ నూత్న స్నేహితురాండ్రు తన్ను సంగీతం పాడమని ప్రార్థించినప్పుడు, తాను పాడుటకు సందేహించలేదు. వారా పాట విని ఆనందంలో ఏవో లోకాలకు తేలిపోయామని ఉప్పొంగిపోతూ తన్ను మెచ్చుకొన్నారు. భగవంతుడు తనకా గాంధర్వ మహిమను ప్రసాదించింది ఏదో ఉత్కృష్ట సేవ జగానికి అర్పించమనేకదా! ఎంతకాలం తాను నీడలను చూచి భయపడి పారిపోవడం? తన బావ ఢిల్లీలో తన్ను కలుసుకుంటాడా సరేసరి అతనికి నిజమైన సైదోడై, అతని నీడనుండే సంఘసేవలో మానవజాతికి సాష్టాంగమవుతుంది. తన్ను కలుసుకోలేడూ - తాను ఒంటిగానే బ్రతుకుదారుల ప్రయాణిస్తూ జాతికి పరిచర్య చేస్తుంది. చదువు పూర్తి చేస్తుంది. సేవచెయ్యాలనే అనుకుంటే, చేసే దీక్ష కలవారికి మార్గాలూ ఉన్నాయి. మార్గాలలో మహోత్తమమైనవీ ఉన్నాయి.

ఇంక తన బావను దూరంనుండే ఆరాధించుకుంటూ తన సేవామార్గాన్ని అనుసరించిపోతుంది.

మనుష్యులెంత దగ్గిరవారైనా వారి హృదయాలు ఇనుపగోడల వెనక ఉన్నట్టు ఉంటాయి. ఆ హృదయాలు తామన్న ప్రేమార్ద్రతా పూర్ణములై కరిగిపోతాయని నమ్మినంతసేపూ ఆ హృదయాలు ఆ రీతిగానే ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఎదుటి జీవితాలలో అర్థములేని ఏదో ఒక సంఘటన జరిగేసరికి, ఆ సంఘటన ఇవతలి హృదయాలపై కోటి క్రీనీడలుగా ముసురుకొని దర్శనమిస్తుంది. ఇంక వీరికీ వారికీ ఇంతవరకూ ఉన్న సామరస్యం మాయమై, కాకోలంవంటి విషం ఉద్భవిస్తుంది. తాము గరళకంఠులై ఎవరా విషం ఆస్వాదించగలరు?

తన బావ తన్ను ప్రేమించడం లేదని తానెందుకు నిర్ధారణ చేసుకోగలిగింది? పద్దాలు నిట్టూర్చింది. రైలు స్టేషనులో ఆగుతూనే ఉంది. యోజనాలను అంగుళాలు చేస్తూ సాగిపోతూనే ఉంది.

తాను మాత్రం తన బావను అంతు ఎరగని గంభీర ప్రేమతో ప్రేమించి ఉంటే, తనకెందుకు బావంటే విసుగు జన్మించింది? బావంటే ఏదో భయంవేసి ఏదేని సాకుతో

అడివి బాపిరాజు రచనలు - 7

170

జాజిమల్లి(సాంఘిక నవల)