పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీళ్ళూ సముద్రంలో కలవవు; అన్ని నీళ్ళూ బట్టలు ఉతకవు. అన్ని నీళ్ళూ మనుష్యుల దాహం తీర్చవు. అన్ని నీళ్ళూ మనుష్యుల ఈత ఆనందం తీర్చవు.

ఈత అంటే మొదట ఎల్లమంద భయపడ్డాడు. గోదావరి ఏడాదికో విద్యార్థిని బలిపుచ్చుకుంటూ ఉంటుంది.

ఒక స్నేహితుడు: ఎల్లమందా రావోయీ ఈత నేర్చుకోపోతే జన్మలో ఒక ఆనందం మనకి తప్పిపోయిందన్న మాట.

ఎల్లమంద: గోదావరిలో దిగటమే?

స్నేహి: గోదావరి మనకు విరోధంట్రా?

ఎల్ల: అదికాదురా, నాబోటి దద్దమ్మలే గోదావరికి బలి అవడం!

స్నేహి: ఒరే ఫుట్‌బాల్ ఆటలో అందరినీ మించి పోయినవాడవు నీకు ఈత రాకపోతే, పెద్ద అవమానం కాదుట్రా? రా నేను నేర్పుతాను. బలయ్యేవాళ్ళు, ఎప్పుడూ ఎందులో పడితే అందులోనే బలి అవుతారు.

ఆ నాటినుండి ఎల్లమంద పట్టుదలగా ఈత నేర్చుకోవడం సాగించాడు. ఒంటిగా తనకడకు వచ్చినప్పుడల్లా గోదావరి తల్లి ఎల్లమందతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండేది. అలాంటి దేవి ఇప్పుడు చేతులుచాచే అతన్ని పిలిచింది. హృదయానికి అదుముకుంది. అతనితో తనివితీరా మాట్లాడేది. మాటలాడేటప్పుడు ఆమె వాక్యాలు హృదయానికి వినబడేవి. అతని హృదయం ఆమెతో మాటలాడేది.

నెల రోజులలో భయం పోయింది. మూడు నెలలలో ఈత రకాలన్నీ వచ్చాయి. నాలుగు నెలలలో దమ్ముపట్టడం వచ్చింది. అయిదు నెలలలో దూరం వెళ్ళడం వచ్చింది. ఆరు నెలలలో ఈతలో అందె వేసిన చేయి అయ్యాడు.

ఇంత చక్కగా అతనికి ఈత రావడానికి ఎక్కువ కారణం గోదావరిదేవే!

గోదావరి కొందరిని ప్రేమిస్తుంది. వారిని ఆభరణంలా తన హృదయంలో ధరిస్తుంది. తల్లి, చిట్టి తనయునకు తప్పటడుగులు నేర్పినట్లు, గోదావరి ఆ బాలుని తేల్చివేత, కుక్క ఈత, చిట్టిచేప ఈత, బాద ఈత, పక్క ఈత, నిలువు ఈత నేర్పుతుంది. చివరకు తన హృదయంపై వెల్లకిలా పరుండి కాళ్ళూ చేతులూ కదపకుండా తేలిపోవడం నేర్పుతుంది..

ఎల్లమంద గోదావరితోనే మాటలాడుతూ ఉండేవాడు. అతని అనుమానాలన్నీ ఆ మహానదీమ తల్లే తీర్చేది.

ఎల్లమంద: నీఈడు ఎంత తల్లీ?

గోదావరి: నేను అనాది దేవిని. నా జననం గంగకు పూర్వమే. ఈ దక్కను పీఠభూమి ఆదికచ్ఛపము వీపు. అప్పుడే నేనూ ఉద్భవించాను తండ్రి.

ఎల్లమంద: తల్లి, ఈ మాలమాదిగలకు మోక్షం లేదా? వాళ్ళు ఏమి తప్పుచేస్తే ఈలాంటి శిక్షపడింది అమ్మా.

గోదావరి: నాయనా! ఒక జాతియొక్క పొగరు కారణం. ఒక జాతి ఎక్కువ బలమయినది. ఎక్కువ నాగరకత కలది. ఆ జాతి ఈ జాతిని ఓడిస్తుంది. ఓడిపోయిన జాతితో


అడివి బాపిరాజు రచనలు - 7

15

నరుడు(సాంఘిక నవల)