పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయమందిన జాతి ఏ సంబంధమూ కలుగజేసుకోడానికి ఇష్టపడదు. వాళ్ళచేత అడ్డమైన చాకిరీలు చేయించుకొంటుంది.

ఎల్లమంద: మేము మొదటనుంచీ ఈ రాజ్యాలు ఆక్రమించుకొని ఉన్నవాళ్ళమా?

గోదావరి: అవునయ్యా అవును, ఈ ప్రపంచంలో మొదట ఉద్భవించింది మీరు. మిమ్ము రాక్షసులనీ, నిశాచరులనీ, నరమాంసాశనులనీ పేరుపెట్టారు. మీలో నరమాంసాశనులూ ఉండేవారు, నిశాచరులూ ఉండేవారు. మీరూ, మాలలూ ఆ అనాది జాతికి రాజకులాలవారు.

ఈలా గోదావరితో తన ఆవేదనను వెళ్ళబోసుకునేవాడు. తాను రాజునన్న మహాభావం అతనికి కలిగింది.

ఎవరి జన్మకు మెట్లు కట్టుకుంటారో వారు పైకి వెళ్తారు. లేనివారు వేసినచోట ఉంటారు. అన్న ఒక జాతీయ నాయకుని మాటలు ఎల్లమందకు ఆశయ వాక్యాలయ్యాయి.

అన్ని పరీక్షలూ నెగ్గాడు. అతని చదువే అతనికి స్నేహితుడు. అతనికి గోదావరి స్నేహితురాలు. అతని బంతి ఆట అతనికి ప్రియురాలు.

5

మాదిగ ఎల్లమంద బి.ఏ ప్యాసయి వచ్చాడని జక్కరం మారు మ్రోగింది. జక్కరం మాదిగపల్లిలోని వాళ్ళంతా ఎల్లమందను చూడటానికి వచ్చారు. అందరితోనూ నవ్వుతూ మాటలాడాడు, గుడిసెముందు నులక మంచంమీద కూర్చుని.

వెంకన్న: ఏంటిరా ఎల్లమందయ్యా, మరిగంటే అదేటి బి.ఏ. పాసు అయినావు గంద. మరి ఏంటి ఉద్యోగం సేత్తావు?

సుబ్బి: ఆడు కలటేరు సేత్తాడు?

పాపాయి: కలకటేరే! అది తెళ్ళోళ్ళకే గాందంటే.

లచ్చన్న: ఓస్ ఈ మద్దెనే నళ్ళోళ్ళకీ ఇత్తుండారు. ఆళ్ళూ తెల్లదొరల ఏసాలే ఏసి పెద్ద కలకటేరుపనే సేత్తుండారు కాదేంటి?

ఏమి చెయ్యాలి. ఎల్లమంద? ఒక పక్కన ప్రభుత్వ ఉద్యోగం చెయ్యాలని ఉంది. ఒక వైపున ప్రభుత్వోద్యోగం జీవితం కాక ఏదో మహత్తర కార్యం చేయాలని ఉంది. కలక్టరు పని చేస్తాడు. అంటే కష్టపడితే ఏకంగా ఏ డిప్యూటీ తాసీల్‌దారు పనో ప్రభుత్వంవారు ఇస్తారు. అక్కడనుంచి నెమ్మదిగా తాసీల్‌దారు పని, ఆ తరవాత డిప్యూటీ కలెక్టరు పని ఉపకార వేతనకాలం వచ్చేసరికి ఏ సెలక్షనుగ్రేడో వచ్చి జిల్లా కలెక్టరు, రెవిన్యూ బోర్డు సభ్యుడూచేసి, ఉపకార వేతనం పుచ్చుకోడం!

తనకూ, తన కుటుంబానికీ ధనం, మంచి యిల్లు, బంట్రోతులు, మంచి బట్టలు, కారు, నగలు వస్తాయి; తనకూ సంఘంలో గౌరవం. ఇప్పుడు తనకు ఇరవై ఏళ్ళున్నాయి. ముప్పది నలుబది ఏళ్ళు ఈ మెట్లు ఎక్కుతూ ఉంటాడు. అంతకన్న ఏం కావాలి.

ఈలోగా అమెరికన్ ఫాదిరీ ఒకడు, ఇంగ్లీషు ఫాదిరీ ఒకడూ కొందరు తెలుగు ఫాదరీలు తన్ను క్రైస్తవమతం పుచ్చుకోమని పోరు పెడుతున్నారు. తమ శక్తివల్ల అతనికి మంచి ఉద్యోగం వేయిస్తారుట. తమ మతం మంచిదట!


అడివి బాపిరాజు రచనలు - 7

16

నరుడు(సాంఘిక నవల)