పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కానాడు తపస్సు. ఆ పిల్లది, తన ఇల్లాలు, తమ చిన్నతనంలో దేవతలా ఉండేది. ఇప్పుడు దేవతకాదా?

అతడు ఒక సోఫాలో చతికిలబడినాడు. ఆ బాలిక కోసం కాదూ తాను కావలిలో కాపురం పెట్టింది? తన పద్మకోసం కాదూ తాను లక్షాధికారి కావాలని పట్టుబట్టి చివరకు జయము పొందినాడు! ఎందుకు తాను మదరాసు వచ్చింది! ఆమెకు సంగీతం చెప్పించడం, ఆమెకు చదువు చెప్పించడం తనకు ఏ కవులూ వర్ణించలేని ఆనందం కలిగేది. ఆమెకు ఎన్నో ముద్దినుసు మురిపాల చీరలూ కొన్నాడు. ఆ చీరలు ధరించుకొని తలదువ్వుకొని, నగలు అలంకరించుకొని, పౌడరు రాసుకొని, వాలుకన్నులతో, ఇంచక్కటి చక్కటి రూపంతో గుళ్ళోబొమ్మలా తన ఎదుటికివచ్చి “నేను. నీకు తగినట్లు ఉన్నానా బావా!” అని తన్నడిగినప్పుడు తానా బాలికను నడుంపట్టి పైకి పువ్వును ఎత్తినట్లు ఎత్తేవాడు.

పద్మే తనకు భార్య కాకపోతే తాను తన వాళ్ళందరి మల్లేనే గోచి పెట్టుకొని వట్టితల పాగాచుట్టుకొని తెప్పమీద సముద్రంలోకి చేపలకోసం వెళ్తూ ఉండవలసినవాడేకదా! సంగీతం చెప్పిస్తే అందులో ప్రపంచంలో అందరి ఆడవాళ్ళ కన్న అద్భుతంగా పాడగలిగిందే! చదువు చెప్పిస్తే అన్ని తరగతులలోను మొదటిగా వచ్చింది. చదువు లక్షాధికారులకేనా సొత్తూ?

అతడు చివుక్కున లేచినాడు.

ఆ పద్మ విషయంలో తానిట్టా బొత్తిగా పిచ్చివానిలా అయిపోయినాడేమిటి?

“జాజిమల్లివ్”, “జాజిమల్లిప్” అని వీధిలో పూలవాడు కేక వేసినాడు. పిడుగుపడినవానిలో బుచ్చి వెంకట్రావు మ్రాన్పడిపోయినాడు.

3

పద్మావతికి పూలంటే ప్రాణం కదా! అందులో జాజిమల్లి పూలంటే చెప్పలేని ఇష్టం. తన తోటలో ఎన్నో జాజిమల్లి పందిళ్ళు పెంచింది. గులాబీలు, దాలియాలు, చేమంతులు, కార్నేషన్సు, ఆరురకాల బోగైస్ విల్లాలు, కనకాంబరాలు ఎన్ని రకాల పూవులో!

ఎవరో నేర్పినట్లు ఆ పూలూ ఆకులూ గుత్తులు కట్టి కళాశాలలో బల్ల లలంకరించేది.

తల్లో పూలచేరులు ఆమే అలంకరించుకోవాలి. ముడి వేసుకుంటే అర్థచంద్రంగా, జడవేసుకుంటే మధ్య కనకాంబరపు సూర్యబింబం, చుట్టూ రెండువరసల జాజిమల్లెలు.

కొందరు పూలు తోరణాలులా అసహ్యంగా ముడుచుకుంటారు. పద్మావతి దేవతా స్త్రీల అలంకరించుకుంటుంది.

చిన్ననాడు కాడమల్లెలు ఎంత సొంపుగా దండలు కట్టేది, 'పువ్వులదానా' అని తాను పదాలును పిలిచేవాడు.

పద్దాలుకు తనపైన ప్రేమేలేదా?

పద్దాలు! పద్దాలు!!

★ ★ ★

రైలు కొత్తరకపు కెనడా ఇంజనుతో లోకాలు పడిపోయినట్లు ముందుకు సాగిపోతోంది.

అడివి బాపిరాజు రచనలు - 7

167

జాజిమల్లి(సాంఘిక నవల)