పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తన రైలు పెట్టెలో తనతో ప్రయాణం చేస్తున్న ఇద్దరు అరవ స్త్రీలు పద్మావతిని అరవంలో ఏవో అడిగినారు. ఏవో నాలుగు ముక్కలు పట్టుబడ్డాయి కాని పద్మావతికి అరవమేమీరాదు. ఆ పెట్టెలో ఐదు సీట్లే ఉన్నాయి. అయిదుగురు పద్మావతితోపాటు ప్రయాణం చేస్తున్నారు. ఒక అమ్మాయి మారువాడీ అమ్మాయి. ఒక అమ్మాయి పంజాబీ యువతి. వారు నలుగురూ కూడా ఢిల్లీకి ప్రయాణం. పద్మావతి మొదట ఢిల్లీకి పోయి, అక్కడనుండి వెనక్కు కాశీ వెళ్ళడానికి నిశ్చయించుకొని బయలుదేరింది.

అరవస్త్రీలలో ఒకతె ఇరువదిరెండేళ్ళ పడుచు. ఆ యువతి పద్మావతి సంగీత కచేరీ ఒకదానికి హాజరయింది. ఈ గీతాదేవిగానం పరమాద్భుతం అని ఆమె అప్పుడే అనుకుంది. రేడియోలో ప్రోగ్రాం వచ్చినప్పుడు ఎప్పుడూ ఆ బాలిక అతిసంతోషంగా వినేదీ. వసంత కుమారీ, పట్టమ్మాళూ ఒక వైపూ, గీతాదేవీ, సుబ్బలక్ష్మీ ఇటువైపూ, వీరు నలుగురూ స్త్రీ గంధర్వరాజ్యాలకు మహారాణులు అని ఆ బాలిక అనుకొన్నది. ఎంత అరవబాణికి శిష్యురాలైనా ఈ గీతాదేవిలో నిజమైన తెనుగుబాణీ యొక్క మహామంత్రిత మాధుర్యం ఏదో ఉంది అనుకొన్నది. ఈనాడు ద్రవిడ ప్రజాలోకం ఈ తెనుగు బాణీకి ముగ్దులవుతున్నారు. అది సంగీత సంప్రదాయ సభాసంఘం కాకపోవచ్చుగాక, కాని అరవ సినీమాలలో పాడే భానుమతి, సూర్యకుమూరి, కన్నాంబ, బాలసరస్వతి, లీల ద్రావిళ్ళను మాయ కమ్మినట్లు తమ తీయని పాటల మంత్రాలతో కట్టివేశారు.

నిజమైన సంప్రదాయం దెబ్బతింటున్నది సత్యమే! అయినా గాలి ఎటు వీస్తోందో తెలియటం లేదూ!

“ఏమండీ మీ పేరు గీతాదేవి కాదూ?” అని ఆ మీనాక్షి అమ్మాళ్ ఇంగ్లీషులో పద్మావతిని ప్రశ్నించింది.

“అవునండీ, మీ పేరు?”

“మీనాక్షి, ఈవిడ మా వదినగారు, పర్వతవర్ధనమ్మాళ్, ఆవిడ భర్త మా అన్నా, మా వారూ, ఢిల్లీ సెక్రటరేట్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు.”

“నేను కాశీకి మెట్రిక్యులేషన్ పరీక్షకు వెడుతున్నాను.”

“చాలా సంతోషం .”

“నా పేరు మీ కెట్లా తెలిసిందీ?”

“మీ కచ్చేరీకి ఓ దానికి వచ్చాను. ఎంత గొప్ప పాటండీ మీది!” “తెలుగువారి సంగీతం మీకు నచ్చిందా!”

తెలుగువారి సంగీతమూ, అరవవారి సంగీతం అని, అద్భుతమైన సంగీతాలకు తేడాలు ఉంటాయా! బాణీలు తేడాలు ఉంటాయి, మీ వేషం వేరు, అయినా మనం ఇద్దరం భారత స్త్రీలమే కాదండీ!”

ఇంతలో ఆ పంజాబీ అమ్మాయి వీరిద్దరి దగ్గరకు వచ్చి కూర్చుని “మాది ఒకనాడు లాహోరు. ఈ రోజు మదరాసు కాపురం, ఢిల్లీలో మా నాయనగారు మిలిటరీలో ఉన్నారు. కెప్టెన్! మావారు ట్రిప్లికేనులో కొత్తగా బట్టల దుకాణం పెట్టుకున్నారు. బాగా లాభం వస్తోంది. మేం త్యాగరాజ నగరులో ఉంటున్నాము. మదరాసు వచ్చి రెండేళ్ళపైన అయింది.

అడివి బాపిరాజు రచనలు - 7

168

జాజిమల్లి(సాంఘిక నవల)