పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మోము చూస్తూ ఏవేవో అద్భుతమైన ఆలోచనలలో మునిగిపోయింది. తన బావ! తన బావ! జాజిపూవులు, సన్నజాజులు, జాజిమల్లెలు! తన బావ సినీమా కంపెనీ పెట్టినాడని నరసింహమూర్తి మేష్టారన్నారు.

ఎందుకు సినీమా కంపెనీ?

ఎందుకు ఆ గొడవంతా నెత్తిమీద పెట్టుకొన్నాడు తన బావ!

ఎన్ని లక్షలో ఖర్చు?

తాను తనకు ప్రాణమూ ఆత్మ అయిన బావను వదిలి అలా దూరంగా వెళ్ళిపోతే తన బావ సినిమాలు పెడతాడు. నాటకాలూ పెట్టవచ్చును. ఇదంతా తన తప్పు.

తనకు 'గీతాదేవి' అని బిరుదు. తాను సంగీత కళానిధిగా పేరు సంపాదించింది. అంతకూ ఎవరు కారణం? ఎవరమ్మా తనకీ పెద్ద ఆలోచనలు ఆలోచించే శక్తి నిచ్చింది? బావ! తన బావ!

గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ అతివేగంగా వెళ్ళిపోతోంది. కొత్తరకం కెనడా రైలు ఇంజను అతివేగం.

ఈనాడు జీవితమే అతివేగం. ఎన్ని జన్మలకో కలగవలసిన సంస్కారం ఈనాడు తనకు ఈ కొద్ది సంవత్సరాలలోనే చేకూరిందే.

రైలు గూడూరు వచ్చింది. పక్క మగవారి సెకండు క్లాసులో ఉన్న నరసింహమూర్తి మేష్టారు వచ్చి “భోజనం వస్తుంది. భోంచేయి తల్లీ!” అన్నాడు.

“మేష్టారూ! బావగార్ని నేను చూడకుండా బయలుదేరాను!”

“నిజమే! అంత తొందరగా బయలుదేరాం మనం మరి!”

“మీరైనా నాకు గట్టిగా చెప్పలేదేమండీ!”

“నేనా! నేనా!”

“పోనీలెండి. మీకు మాత్రం ఏం తెలుసు నా మనసు? ఏమిటో ఇంత తొందరపడి పోయాను!”

నరసింహమూర్తి మేష్టారు మౌనంగా ప్లాట్‌ఫారంలో చూడని చూడని చూపులతో ఎవరికొరకో చూస్తున్నాడు.

“బావగారని నన్ను ఏరోప్లేనులో వచ్చి కలుసుకోమంటే!”

“వస్తాడా?”

"ఇక్కడే ఒక టెలిగ్రాం ఇవ్వండి!"

“ఏమని?”

"నాకు చూడాలని బెంగగా ఉందనీ, ఇద్దరం కలిసి కాశీ, ప్రయాగా, బృందావనం. మధుర, గోకులం మొదలైనవి చూడాలనీ!”

“పరీక్షలైనవరకూ చూడడం ఎలా పడుతుందీ? అప్పుడే వస్తానంటే?”

“మీరు టెలిగ్రాం ఇవ్వండి మేష్టారూ!”

“నువ్వు మదరాసులో అతణ్ణి చూడకుండా వచ్చేశావు! ఇప్పుడు చూడాలని అంటే, అతడు -”

అడివి బాపిరాజు రచనలు - 7

164

జాజిమల్లి(సాంఘిక నవల)