పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పళ్ళు బిగించి ఎలా వెళ్ళినాడో ముందుకు ఆరవగోలు చేయడానికి. అప్పుడు సీనియర్ బాక్ ఒకడు అతన్ని కాలు అడ్డంబెట్టి పడదోసి డొక్కలో పొడిచాడు. ఎల్లమంద పడిపోయాడు. అందరూ గొల్లుమన్నారు. రిఫరీ మండిపోయి, ఈలవేసి ఆట ఆపుచేసి పెనాల్టీ (శిక్షగా గోలుకు అడ్డం లేకుండా ఎదురుగుండా బంతి తన్నుట) ఇచ్చినాడు. సీనియర్ ఆటగాళ్ళు ఆ ఫుట్‌బాల్‌ను నాచుతిట్లు తిట్టుకున్నారు.

ఆ అధర్మపు దెబ్బలకు ఎల్లమంద కొంత బాధపడిన మాట నిజమే, కాని లేచి ఒక్కసారి ఒళ్ళు దులుపుకొని నుంచున్నాడు. తన జట్టు నాయకుడయిన సెంటర్ హాఫ్‌బాక్‌వద్ద తానే ఆ బంతి తన్నుటకు అనుమతి పొంది ఈల వేయగానే ఆ బంతి పిడుగు వేగంతో సరిగ్గా మూలనుంచి వెళ్ళేటట్లు తన్నినాడు. అది గోలయి ఊరుకుంది.

3

ఆ మరునాడు నుంచి ఎల్లమంద కళాశాలకంతకూ నాయకుడు, కాలిబంతి ఆట మాంత్రికుడు అయ్యాడు. ఆటల ఉపాధ్యాయుడు ఎల్లమందను తాను సృష్టించినట్లు ఛాతీ విప్పుకు తిరిగాడు. ప్రతీ విద్యార్థి సయద్ అహమ్మద్, భద్రుడు, ముష్టి లక్ష్మీనారాయణ, సూరయ్య, తటవర్తి బుచ్చిరాజు అందరూ కలిసి ఇతనిలో ప్రత్యక్షమయ్యారు కాబోలు ననుకొన్నారు.

సీనియరు జట్టువాళ్ళు, ఎల్లమంద మాకు కావాలన్నారు. ఎల్లమంద తాను ఆ జట్టులోనికి వెళ్ళనని ఆటల ఉపాధ్యాయునితో అన్నాడు.

కాలేజీ ప్రధానాచార్యులవారు ఎల్లమందకు కబురు పంపి, “ఏమయ్యా నువ్వు సీనియర్ జట్టుకు వెళ్ళనన్నావుట ఏమిటి?” అని అడిగాడు.

ఎల్లమంద: వాళ్ళు ఆ రోజున నన్ను చేసిన ఫౌల్సు నా జన్మలో ఎప్పుడూ ఏ ఆటలోనూ పొందలేదు. నా మనస్సు ఆ జట్టుతో కలియలేదండి.

ప్రధానాచార్యులు: (ఎల్లమంద ముఖము తేరిపార చూచి, ఆ బాలకుని స్వచ్చహృదయము, అవమాన తప్తమైన అతని మనస్సు గ్రహించాడు.) ఏమయ్యా మన కాలేజీ జట్టు ఇతర కాలేజీలతో ఆడవలసి వస్తే నువ్వు కాలేజీ జట్టుతో ఆడకపోతే యెల్లాగు?

ఎల్ల: చిత్తమండి, మన కాలేజీ ఎవరితో ఆడవలసి వచ్చినా నేను తప్పక కాలేజీ జట్టులో ఆడి తీరుతానండి.

ప్రిన్సి: కృతజ్ఞుణ్ణి!

ఎల్లమంద హాస్టలుకి వెళ్ళిపోయాడు. అతనికి చాలా గౌరవం సంభవించింది. కాని అతన్ని హృదయంలోనికి తీసుకునేదెవరు? లోతులేని హృదయం కలవారికి అతని స్థితి అర్థంకాదు. హాస్టలు విద్యార్థులు మాత్రం అతన్ని దగ్గిరగా తీసుకుంటారా? అతనితో కడుపునిండా మాట్లాడుతారా?

ఆలోచనా శక్తి గలవారికే బాధలన్నీ? ఎల్లమందవల్లనే కాలేజీకి కాలిబంతి ఆట బహుమానాలు వచ్చాయి. ఎల్లమందకు ఆయా సమయాలలో చూపించే గౌరవం ఇంతింతని కాదు. ఆ తర్వాత అతని మొఖం చూచేవారు ఒక్కరూ లేరు.

అడివి బాపిరాజు రచనలు - 7

12

నరుడు(సాంఘిక నవల)